గోవా వెళ్లి మాయమై..గాయాలతో సిటీకి!

గోవా వెళ్లి మాయమై..గాయాలతో సిటీకి!
  • ఆలస్యంగా వెలుగు చూసిన కారు డ్రైవర్ ఘటన
  • కిడ్నీలు మాయం చేశారనే అనుమానంతో పంజాగుట్ట పోలీసులకు కంప్లయింట్​ 
  • నిమ్స్​లో చేరిన బాధితుడికి మెడికల్ ​టెస్టులు

హైదరాబాద్‌‌,వెలుగు: గోవాకు టూరిస్టులను తీసుకెళ్లిన కారు డ్రైవర్ కిడ్నాప్‌‌ అయ్యాడు. 17 రోజుల తర్వాత తలపై గాయాలు, కడుపుపై కుట్లతో మంగళవారం సిటీలో ప్రత్యక్షమయ్యాడు. గోవాలో తనను కిడ్నాప్ చేసి కిడ్నీలు దొంగిలించారని పంజాగుట్ట పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే... భువనగిరికి చెందిన శ్రీనివాస్‌‌(42) ఇరవై ఏండ్ల కిందట సిటీకివచ్చాడు. భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి బోరబండ బంజారానగర్‌‌‌‌లో ఉంటున్నాడు. గత నెల19న ఘట్‌‌కేసర్‌‌‌‌కు చెందిన భాస్కర్‌‌ టెంపో ట్రావెల్స్‌‌లో టెంపరరీ డ్రైవర్‌‌‌‌గా టూరిస్టులతో కలిసి గోవాకు బయలుదేరాడు. తర్వాతి రోజు  అక్కడికి చేరారు. టూరిస్టులు గెస్ట్ హౌస్​లో రెస్ట్ తీసుకుంటుండగా శ్రీనివాస్‌‌ బయటకు వెళ్లాడు. రాత్రి 7 గంటలకు డిన్నర్​ కోసం శ్రీనివాస్‌‌ కు టూరిస్టులు ఫోన్​ చేసి పిలిచారు. గుర్తు తెలియని ప్రాంతంలో ఉన్నానని శ్రీనివాస్ చెప్పాడు. లొకేషన్ షేర్ చేయాలని టూరిస్టులు అడిగారు. ఆ తర్వాత శ్రీనివాస్ మొబైల్‌‌ స్విచాఫ్ అయ్యింది. దీంతో టూరిస్టులు భాస్కర్‌‌ ట్రావెల్స్​కు సమాచారం అందించారు. శ్రీనివాస్ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు అదే నెల 21న గోవాకు వెళ్లి  పోలీసులకు కంప్లయింట్​ చేయగా మిస్సింగ్​ కేసుగా ఫైల్​ చేశారు. అక్కడ వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చారు.  సోమవారం రాత్రి శ్రీనివాస్‌‌ సిటీలోని ఇంటికి తిరిగిరాగా అతని తల,కడుపుపై సుమారు 50కి పైగా కుట్లను కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే స్థానిక కార్పొరేటర్​ బాబా ఫసీయుద్దీన్‌‌ను కలిశారు. అతడు మంగళవారం నిమ్స్‌‌లో శ్రీనివాస్​ను అడ్మిట్‌‌ చేశారు.  అతడిని కిడ్నాప్ చేసి కిడ్నీలు తీసుకున్నారనే అనుమానంతో బాధితులు పంజాగుట్ట పోలీసులకు కంప్లయింట్​చేశారు. డాక్టర్లు టెస్ట్‌‌లు చేసిన తర్వాత ఏం జరిగిందనేది నిర్ధారిస్తారు.