
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్... ఆ జట్టుతో తొలి టీ20 మ్యాచ్లో మాత్రం కంగుతింది. సిరీస్ రేసులో నిలవాలంటే రెండో టీ20 టీమిండియాకు కీలకం కానుంది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ లక్నో వేదికగా ఆదివారం ఏకానా స్టేడియంలో జరగనుంది. మొదటి టీ20 మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో హార్దిక్ సేన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. అయితే రెండో టీ20 మ్యచ్ లో తుది జట్టులో మార్పులు చేయాలని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ సూచించాడు.
పొట్టి ఫార్మాట్‌లో పేసర్ ఉమ్రాన్ మాలిక్ నిరాశపరుస్తున్నాడని జాఫర్ అభిప్రాయపడ్డాడు. అతడు తన బౌలింగ్‌లో వైవిధ్యాన్ని చూపించకపోతే ఈ ఫార్మాట్‌లో ఇబ్బందులకు గురవుతాడని చెప్పాడు. రెండో టీ20లో ఉమ్రాన్ స్థానంలో జితేశ్ శర్మను తుదిజట్టులోకి తీసుకోవాలని జాఫర్ తెలిపాడు. జితేశ్‌ను కాకుంటే పృథ్వీషాను కూడా ఆలోచించొచ్చని అన్నాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలంటే జితేశే ఉత్తమ ఎంపిక అని చెప్పుకొచ్చాడు.