గోదావరిలోకి ‘మహా’ వ్యర్థాలు

 గోదావరిలోకి ‘మహా’ వ్యర్థాలు

భైంసా, వెలుగు: గోదావరి నదికి బాసర వద్ద మహారాష్ట్ర నుంచి ముప్పు పొంచి ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న  ఆల్కహాల్​ ఫ్యాక్టరీ వ్యర్థాలు గోదావరిలోకి విడుదల చేసేందుకు అక్కడి నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఫ్యాక్టరీ నుంచి గోదావరి వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాలువ ద్వారా ఏడాది పాటు నిల్వ చేసిన వ్యర్థాలను విడుదల చేయబోతున్నారు. ఏటా వానాకాలం ఆరంభంలో నదిలో విషపూరితమైన వ్యర్థాలు కలుస్తున్నా పొల్యూషన్ ​కంట్రోల్​బోర్డు ఆఫీసర్లు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ ఏడాదైనా ముందుచూపుతో వ్యవహరిస్తే బాసర గోదావరికి ముప్పు తప్పినట్లవుతుంది.

ఏడాదిపాటు నిల్వ చేసి..

బాసరకు సమీపంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్​తాలుకాలో ‘పయనీర్​ డిస్టిలరీ ​లిమిటెడ్’​ అనే ఆల్కహాల్ ​ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో వెలువడే వ్యర్థాలు, రసాయనాలను ఏడాదిపాటు ఒక దగ్గర నిల్వ చేస్తున్నారు. ఈ విషపూరిత వ్యర్థాలు వ్యవసాయ భూముల్లోకి చేరితే పంటలు పండవు. మహారాష్ట్రలోని రైతులు ఈ వ్యర్థాలు వారివైపు విడుదల చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం బాసర గోదావరి నదిపై దృష్టి సారించింది. ఏటా జూన్​ చివరి వారంలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఆ సమయంలో ఆల్కహాల్​ ఫ్యాక్టరీలో ఏడాది పాటు నిల్వ చేసిన వ్యర్థాలు, రసాయనాలను ప్రత్యేక ఒర్రె ద్వారా 5 కిలోమీటర్ల దూరంలోని గోదావరిలో కలిపేస్తున్నారు. దాంతో ఇక్కడి నీరంతా రంగు మారుతోంది. తెల్లటి నురగ కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. ఈ ఏడాది కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం వ్యర్థాలను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యర్థాలు ఎక్కడా ఆగకుండా ఉండేందుకు కాలువలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను ఇప్పటికే తొలగించారు.

రోగాలబారిన ప్రజలు

వ్యర్థాలు కలిసిన నీటిలో స్నానం చేసిన భక్తులకు చర్మవ్యాధులు, ఇతర రోగాలు సోకుతున్నాయి. కొన్నేండ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో భక్తులు నీటిలో దిగాలంటేనే భయపడుతున్నారు. నీరు కలుషితం కావడంతో నదిలోని చేపలు సైతం మృతి చెందుతున్నాయి. సమీపంలో ఉన్న బాసర ట్రిపుల్​ ఐటీకి సైతం గోదావరి నీరే ఆధారం కావడంతో 8 వేల మంది స్టూడెంట్లపై ప్రభావం పడనుంది. ఫ్యాక్టరీ నుంచి నిత్యం వస్తున్న దుర్వాసనతో ఇప్పటికే స్టూడెంట్లు శ్వాసకోస సమస్యలతో బాధ పడుతున్నారు. నిర్మల్, నిజామాబాద్ ​జిల్లాల పరిధిలో నది చుట్టుపక్కల ఉన్న సుమారు వందకుపైగా గ్రామాలు తాగు నీటి కోసం గోదావరిపైనే ఆధార పడ్డాయి. వ్యర్థ రసాయనాలు కలిసిన నీళ్లు తాగితే ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదముంది. ఈసారైనా ఆలయ అధికారులు, పొల్యూషన్ ​కంట్రోల్ ​బోర్డు ఆఫీసర్లు ముందుచూపుతో వ్యవహరించి వ్యర్థాలు గోదావరిలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు, బాసరవాసులు కోరుతున్నారు. 

ఆఫీసర్లు తగిన చర్యలు తీసుకోవాలె

పవిత్ర గోదావరి నదిలో రోజు వేలాది మంది పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. నది పరివాహకంలోని వందలాది గ్రామాలు తాగునీటి కోసం గోదావరిపైన ఆధారపడి ఉన్నాయి. అటు మత్య్సకారులు సైతం జీవనోపాధి పొందుతున్నారు. మహారాష్ట్రలోని ఆల్కహాల్​ ఫ్యాక్టరీ వ్యర్థాలు ఈ ఏడాది సైతం గోదావరిలోకి విడుదల చేయాలని చూస్తున్నారు. వ్యర్థాలు గోదావరిలో కలపకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి.

– సాయినాథ్, బాసర వాసి

పొల్యూషన్​ బోర్డుకు ఫిర్యాదు చేస్తం

బాసర గోదావరి నదిలో మహారాష్ట్రలోని ఆల్కహాల్​ ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలు, రసాయనాలు కలువకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పొల్యూషన్​ కంట్రోల్ ​బోర్డు ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తాం. నదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం.

– సోమయ్య, ఆలయ ఈవో, బాసర