చైల్డ్ పోర్న్ చూస్తే బేడీలు

చైల్డ్ పోర్న్ చూస్తే బేడీలు
  • ఐపీ అడ్రస్ లు, ఫోన్ నంబర్లతో పోలీసులు పట్టేస్తరు 
  • దేశంలో ఎక్కడున్నా అరెస్టు చేస్తరు
  • వెబ్ సైట్ల లింకులు క్లిక్ చేస్తే బుక్కే 
  • స్పెషల్ సెల్ ఏర్పాటు చేసిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో

 విజయవాడకు చెందిన ఓ 24 ఏండ్ల యువకుడు ఇంజనీరింగ్ చదివాడు. ఎంఎన్‌‌సీ కంపెనీలో జాబ్‌‌ చేసేవాడు. దాదాపు 4 వేలకు పైగా చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు కొనుగోలు చేశాడు. వాటిని ఆన్‌‌లైన్‌‌లో అమ్మకానికి పెట్టాడు. ఇది గుర్తించిన నేషనల్‌‌ క్రైమ్ రికార్డ్స్‌‌ బ్యూరో... రాష్ట్ర పోలీసులను అలర్ట్ చేసింది. ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు ఇటీవల అతడిని అరెస్టు చేశారు.

హైదరాబాద్‌‌, వెలుగు: చైల్డ్ పోర్న్ చూస్తున్నారా? ఆ వీడియోలను ఇతరులకు షేర్‌‌ ‌‌చేస్తున్నారా? అయితే మీరు జైలుకెళ్లడం ఖాయం. చైల్డ్ పోర్న్ సైట్లను క్లిక్ చేస్తే, మిమ్మల్ని పోలీసులు ట్రాక్ చేస్తారు. ఐపీ అడ్రస్, మెయిల్‌‌ ఐడీ, ఫోన్ నంబర్ల ఆధారంగా వెంటాడుతారు. ఎక్కడున్నా వెతికిపట్టుకొని అరెస్టు చేస్తారు. ఇందుకోసం ‘‘చైల్డ్‌‌ సెక్స్‌‌ అబ్యూస్ మెటీరియల్‌‌’’ పేరుతో నేషనల్‌‌ క్రైమ్‌‌ రికార్డ్స్‌‌ బ్యూరో (ఎన్సీబీ) స్పెషల్‌‌ సెల్ ఏర్పాటు చేసింది. ఎవరైనా చైల్డ్​ పోర్న్ వీడియోల కోసం సెర్చ్ చేసినా, చూసినా, షేర్ చేసినా పట్టేస్తుంది. మన దేశంలో పోర్న్ సైట్స్ పై నిషేధం ఉంది. చైల్డ్ పోర్న్ వీడియోలు చూస్తూ, షేర్ చేస్తున్నోళ్లను ఎన్సీబీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తోంది. ఎన్సీబీ ఇచ్చిన సమాచారంతో రాష్ట్ర పోలీసులు పోయినేడాది 17 మందిని అరెస్టు చేశారు. 
పోర్న్ సైట్లపై నిషేధం ఉన్నా...  
దేశంలో పోర్న్‌‌ సైట్స్‌‌ పై నిషేధం ఉన్నా, చాలా వరకు సైట్లు ఓపెన్ అవుతున్నాయి. వాటిని చూసే వాళ్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. స్మార్ట్‌‌ ఫోన్స్‌‌లో వచ్చే లింకుల ద్వారా పోర్న్ సైట్లను ఓపెన్ చేస్తున్నారు. 
ఆయా సైట్లలో అడల్ట్, చైల్డ్ పోర్న్ వీడియోలను కొనుగోలు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కొంతమంది డబ్బులకు అమ్ముతున్నారు. ఇది కరోనా, లాక్ డౌన్ టైమ్ లో పెరిగిపోయిందని నిఘా వర్గాలు గుర్తించాయి. ఆన్ లైన్ లో మిర్రర్ డొమైన్స్ ద్వారా పోర్న్ సైట్లు ఓపెన్ చేస్తున్నారని గుర్తించాయి. చైల్డ్ పోర్న్ వీడియోలు చూస్తూ, షేర్ చేస్తూ, సేల్ చేస్తున్నోళ్లపై చర్యలు తీసుకున్నాయి. 
ఎక్కడున్నా పట్టేస్తరు..  
‌‌నెట్‌‌లో పోర్న్‌‌ పేరుతో బ్రౌజింగ్ చేస్తున్న వారిపై ఎన్సీబీ స్పెషల్ సెల్ నిఘా పెట్టింది. దేశవ్యాప్తంగా చైల్డ్‌‌ పోర్న్‌‌ సైట్స్‌‌ను క్లిక్‌‌  చేసే వారిని ట్రాక్‌‌ చేస్తోంది. గూగుల్‌‌ లో చైల్డ్‌‌ పోర్న్‌‌ అని టైప్‌‌ చేసిన వెంటనే ఆయా ఐపీ అడ్రస్ లు ఎన్సీబీ సెల్‌‌కు చేరుతాయి. పోలీసులు వాళ్లను ట్రాక్ చేసి, ఐటీ యాక్ట్ 67బి కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరైనా ఇతర దేశాల్లో ఉన్నోళ్లయితే, వారిపై లుక్‌‌ ఔట్‌‌ సర్క్యులర్ జారీ చేస్తున్నారు. ఆయా దేశాల ఎంబసీలకు వాళ్ల డేటాను అందజేస్తున్నారు.  
సైబర్ మోసాలు సైతం.. 
పోర్న్ సైట్లు చూసే వారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్‌‌ చేస్తున్నారు. ఆన్‌‌లైన్‌‌లో పోర్న్ లింక్స్ పంపించి ఓపెన్ చేసేలా చేస్తున్నారు. లింక్స్ ఓపెన్ చేసిన వారి డేటా హ్యాక్ చేస్తున్నారు. ఆయా నంబర్స్‌‌తో లింకైన మెయిల్స్‌‌కి పోలీసుల తరహాలో ఈ–మెయిల్స్ పంపిస్తున్నారు. ఏ సైట్ ను ఓపెన్ చేశారు? ఏ టైమ్ కి క్లిక్ చేశారు? అనే వివరాలను పంపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే అరెస్ట్ చేస్తామని, సోషల్‌‌ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్‌‌మెయిల్ చేస్తున్నారు. దీంతో బాధితులు తమ పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. ఎవరికీ చెప్పుకోలేక సైబర్ నేరగాళ్లు అడిగినంతా డబ్బు ఇచ్చేస్తున్నారు. వేధింపులు భరించలేక చివరికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. 

చైల్డ్ పోర్న్ చూస్తే నేరం... 
దేశంలో పోర్న్ సైట్స్‌‌పై బ్యాన్ ఉంది. చైల్డ్‌‌ పోర్న్‌‌ వీడియోలు చూసినా, షేర్ చేసినా తీవ్రమైన నేరం. గూగుల్‌‌లో చైల్డ్‌‌ పోర్న్‌‌ సైట్‌‌ పేరుతో ఎంటర్ చేస్తే చాలు ఐపీ అడ్రస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల డేటాలో క్యాప్చర్ అవుతుంది. ఇలాంటి వారి సమాచారం సంబంధిత పోలీసులకు చేరుతుంది. గతంలో 8 మందిపై కేసులు నమోదు చేశాం. పోర్న్‌‌ సైట్స్‌‌ చూసే వారిపై రాష్ట్రంలోనూ నిఘా కొనసాగుతోంది. 
- కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్‌‌