సెల్లార్‌లో వాచ్‌మెన్‌ రూమ్ నిర్మించుకోవచ్చు: హైకోర్టు

సెల్లార్‌లో వాచ్‌మెన్‌ రూమ్ నిర్మించుకోవచ్చు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: బిల్డింగ్‌ కన్ స్ట్రక్షన్ రూల్స్‌ 2012 ప్రకారం.. అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ (స్టిల్ట్‌ ఫ్లోర్‌)లో వాచ్‌మెన్‌ రూమ్, రెండు టాయిలెట్స్‌ నిర్మాణం చేసుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, వాటిని ముందస్తు అనుమతితో నిర్మించాలని  చెప్పింది. 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వాటిని నిర్మించుకునేందుకు వీలుందని స్పష్టం చేసింది. వెహికల్స్ పార్కింగ్‌ కోసం నిర్ధేశించిన సెల్లార్లో వాచ్‌మెన్‌ గది నిర్మాణం చేశారంటూ జీహెచ్‌ఎంసీ ఈ నెల 7న ఇచ్చిన నోటీస్‌ను సవాల్ చేస్తూ హైదరాబాద్, మోహన్‌ నగర్‌లోని సీటీఓ కాలనీలో అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌ బిల్డర్‌ కె.రమేశ్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

దీన్ని జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌ విచారించారు. 15 ఫ్లాట్స్‌కు సెక్యూటరీ కోసం వాచ్‌మెన్‌ గది నిర్మాణం చేసేందుకు చట్టంలో వీలుందన్నారు. నోటీసును రద్దు చేయాలన్నారు. దీనిపై మున్సిపల్‌ లాయర్‌ కల్పించుకుని, నోటీసుకు వివరణ ఇవ్వకుండా పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. వాదనల తర్వాత న్యాయమూర్తి, జీహెచ్‌ఎంసీ నోటీసుకు పిటిషనర్‌ ఈ నెల 24లోగా వివరణ ఇవ్వాలన్నారు.