సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తం

సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తం
  •     తాగునీటి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
  •     అదనంగా 15 - 20 ఎంజీడీల నీటి సరఫరాకు సిద్ధం
  •     వేసవి కార్యాచరణపై ఎండీ సుదర్శన్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్,వెలుగు: సిటీలో తాగునీటి సమస్య రాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ తో పాటు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వాటర్​బోర్డు ఎండీ​సుదర్శన్​రెడ్డి తెలిపారు. సిటీతో పాటు ఔటర్ పరిధి వరకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. అవసరం మేరకు వాటర్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. మంగళవారం బోర్డు ఆఫీసులో సమ్మర్ కార్యాచరణ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. వాటర్​బోర్డు ప్రస్తుతం రోజుకు 565 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుందని, అదనంగా మరో 15 నుంచి 20 ఎంజీడీల నీరు అవసరముందని అంచనా వేశామని, ఆ మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. సీజీఎం నుంచి మేనేజర్ స్థాయి వరకు.. క్షేత్రస్థాయిలో అధికారులు సొంతంగా ప్లాన్ చేసుకుని ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. తాగునీటి సరఫరా, కలుషిత నీటి సమస్యలపై వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  నీటి సరఫరా, ట్యాంకర్ల రవాణాపై విజిలెన్స్ అధికారులు డ్రైవ్ చేపట్టాలని సూచించారు. భూగర్భ జల మట్టాల స్థాయిపై నివేదిక తయారు చేసి అందించాలని ఆదేశించారు. సిటీలో ప్రస్తుతం 70 మంచినీటి ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా.. అదనపు స్టేషన్ల ఏర్పాటుకు అనుమతులు పొందాలని సూచించారు. 

ప్రత్యేక డ్రైవ్ నిర్వహించండి

వాటర్ లీకేజీలు, సీవరేజి ఓవర్ ఫ్లో లను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలన్నారు. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన సిల్ట్ ను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. ఎక్కడైనా మ్యాన్ హోళ్లు ధ్వంసమైతే వెంటనే పునర్మిర్మాణం చేపట్టాలని, కవర్లు కనిపించని స్థితిలో ఉన్నా.. వెంటనే కొత్త మూతలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా సమయాల్లో కొంత మంది నల్లాకు మోటార్లతో నీటిని తోడుతున్నట్లు బోర్డు దృష్టికి వచ్చినట్లు తెలిపారు. దీంతో లో -ప్రెజర్ సమస్య తలెత్తి.. మిగతా ప్రజలకు ఇబ్బందులు వస్తున్నట్లు, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ను ఆదేశించారు. రంజాన్ మాసంలో అవసరమైన చోట్ల మసీదులకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. ఈఎన్సీ, ఆపరేషన్స్ డైరెక్టర్-–1 అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్  ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవి, అధికారులు పాల్గొన్నారు.