ఎండిపోయిన 7వేల బోర్లు

ఎండిపోయిన 7వేల బోర్లు

న్యూఢిల్లీ: దేశంలో నీటి కొరత తీవ్రమైంది. చాలా రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నీటి మట్టాలు కనిష్టానికి పడిపోయాయి. నిరుడు వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తాగునీటి అవసరాలు రోజురోజుకీ పెరుగుతుంటే.. గ్రౌండ్ వాటర్ లెవల్స్ మాత్రం అంతకంటే వేగంగా పడిపోతున్నాయి. దేశంలో ప్రధానమైన 21 రాష్ట్రాలను లెక్కలోకి తీసుకుంటే.. 15 స్టేట్స్​లోని రిజర్వాయర్ల నీటి మట్టం పదేండ్ల కనిష్టానికి పడిపోయాయి. 

1.3 కోట్ల జనాభా ఉన్న బెంగళూరువాసుల దాహాన్ని కావేరి జలాలు, బోర్​వెల్స్ తీరుస్తాయి. 95 కిలో మీటర్ల దూరంలో ఉన్న కావేరీ నది నుంచి రోజుకి 145 కోట్ల లీటర్‌‌ల నీళ్లు తీసుకొస్తున్నారు. అటు బోర్‌‌వెల్స్‌‌ నుంచి రోజుకి కనీసం 70 కోట్ల లీటర్ల నీళ్లు తోడుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా కావేరి నదిలో నీటి మట్టం తగ్గి.. సాగు, తాగునీటి సరఫరాకు ఇబ్బంది తలెత్తింది. బెంగళూరు సిటీలో ఉన్న 14,781 బోర్లలో 6,997 బోర్లు ఎండిపోయాయి.  

ప్రత్యామ్నాయ మార్గాలవైపు కర్నాటక

నీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నది. రీసైకిల్ చేసిన ట్రీటెట్ వాటర్ వాడుకునేందుకు కాలనీలు, అపార్ట్‌‌మెంట్ అసోసియేషన్లను ప్రోత్సహిస్తున్నది. అక్రమ నీటి ట్యాంకర్ కార్యకలాపాలను అరికట్టేందుకు హెల్ప్‌‌లైన్‌‌లు, కంట్రోల్ రూమ్‌‌లను ఏర్పాటు చేసింది. మరో 100 రోజుల దాకా నీటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదని వాటర్ బోర్డు అధికారులు అంటున్నారు.