ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెర్రెలు బారిన చెరువులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెర్రెలు బారిన చెరువులు
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పడిపోతున్న  భూగర్భ జలాలు 
  •     భయపెడుతున్న ఉష్ణోగ్రతలు
  •     ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి
  •     తాగునీటి కోసం తల్లాడుతున్న మూగజీవాలు

ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు భయపెడుతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో భూగర్భజలాలు, ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. ఫలితంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ప్రాజెక్టులు అడుగంటి పోవడం, మైనర్ ఇరిగేషన్ చెరువులు, చెక్‌‌‌‌డ్యామ్‌‌‌‌లలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో జిల్లాలో భూగర్భ జలాలు కూడా భారీగా పతనమయ్యాయి. ఫలితంగా ఇటు పంటలకు సాగునీరు.. ప్రజలకు, మూగ జీవాలకు తాగునీటి గండం ఏర్పడింది.  ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసే భారీ వర్షాలతోనే ప్రాజెక్టులు నిండుతాయి. దీన్ని బట్టి చూస్తే మరో రెండు నెలలు పాటు ప్రాజెక్టుల్లో నీటి మట్టం సాధారణంగా ఉండనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర సమస్య

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూగర్భ జలాల నీటి మట్టం తగ్గిపోతోంది. మరో వారం రోజులపాటు ఎండల తీవ్రత ఇదే స్థాయిలో ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. బోర్లు, బావుల్లో నీళ్లు లేక ప్రజలు ఉన్న నీటి వనరులనే పొదుపుగా వాడుకుంటున్నారు. మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడుతున్నారు. కొన్ని పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో రోజు తప్పించి రోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.  గిరిజన ప్రాంతాలు, అడవులు, గుట్టల్లో ఉండే గూడెల్లో నీటి సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడు లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎన్నడూ లేనివిధంగా చెరువులు, వాగులు ఎండిపోయి నెర్రెలు బారాయి. మూగ జీవాలు సైతం తాగునీటి కోసం అల్లాడిపోతున్నాయి. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని  ప్రాజెక్టుల్లోని నీటిమట్టం వివరాలు

ప్రాజెక్టు               నీటి నిల్వ స్థాయి     ప్రస్తుత టీఎంసీలు
కొమురం భీం        10.393                         4.713
వట్టి వాగు               2.890                          1.497 
కడెం                      4.699                           0.910
స్వర్ణ                      1.037                           0.156
సాత్నాల               1.24                             0.117
గడ్డెన్న వాగు         1.83                              0.662
మత్తడి వాగు         0.571                            0.034