నీళ్ల లొల్లిపై ఆగస్టు 5న మీటింగ్

నీళ్ల లొల్లిపై ఆగస్టు 5న మీటింగ్

తెలుగు రాష్ట్రాలకు లెటర్ రాసిన కేంద్ర జలశక్తి శాఖ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు వచ్చే నెల 5వ తేదీన అపెక్సు కౌన్సిల్ మీటింగ్‌ నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. ఇరు రాష్ట్రాలు నిర్మిస్తు న్న ప్రాజెక్టుల డీపీఆర్‌ లే ప్రధాన అజెండాగా మీటింగ్ జరుగనుంది. దాంతోపాటు గోదావరి, కృష్ణా బోర్డుల అధికార పరిధి, నీటి పంపకాలకు వ్యవస్థల ఏర్పాటు, కృష్ణా బోర్డు హెడ్ ​క్వా ర్టర్​ తరలింపు తదితర అంశాలనూ అందులో చేర్చింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు లెటర్​ రాశారు. 5వ తేదీన వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించే అపెక్సు కౌన్సిల్ మీటింగ్‌కు ఆయా రాష్ట్రాల సీఎంలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గోదావరి, కృష్ణా బోర్డులు రెండూ వేర్వేరుగా ఏర్పాటు చేసినా .. వాటికి నిర్దిష్టమైన వర్కింగ్ మాన్యువల్, జ్యూరిస్డిక్షన్ లేవు. దాని వల్ల కొన్ని సందర్భాల్లో బోర్డుల ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వా లు పట్టించు కోవడం లేదు. రెండో అపెక్సు కౌన్సిల్ మీటింగ్‌లో బోర్డుల జ్యూరిస్ డిక్షన్ ‌పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

నదీ జలాల పంపకాలపై..

కృష్ణా, గోదావరి నికర జలాలు, మిగులు జలాల పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి. కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల నీళ్లలో.. తాత్కాలిక వాటాలుగా ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. గోదావరి జలాల్లో అయితే తాత్కాలిక కేటాయింపులూ లేవు. ఏపీ పోలవరం (పట్టిసీమ) ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలించే గోదావరి నీటికి బదులు నాగార్జునసాగర్ కు ఎగువన 45 టీఎంసీల కృష్ణా నికర జలాలు కేటాయించాలని తెలంగాణ సర్కారు ఎప్పటి నుంచో కోరుతోంది. మొదటి అపెక్స్ కౌన్సిల్ భేటీలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చినా.. అప్పటి అజెండాలో లేకపోవడంతో లోతుగా చర్చించలేదు. ఇక హరాబాద్ తాగునీటితో పాటు మిషన్ భగీరథ కింద తాగునీటికి తీసుకునే నీటి వినియోగాన్ని 20 శాతమే లెక్కించాలని తెలంగాణ కోరుతోంది. బచావత్ అవార్డులోని ఏడో క్లాజును అమలు చేయాలని అడిగింది.

అయితే ఈ అంశంపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుటే తేల్చుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. అయినా ఈ అంశాన్ని మీటింగ్​లో లేవనెత్తాలని తెలంగాణ సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. గోదావరి బోర్డు తెలంగాణలో, కృష్ణా బోర్డు ఏపీలో ఏర్పాటు చేయాలి. మొదట్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటంతో రెం డు బోర్డులను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేశారు. అయితే ఏపీ తన పాలనను పూర్తిగా షిఫ్ట్ చేసుకోవడంతో కృష్ణా బోర్డును తరలించాలని ఏపీ కోరుతోంది. మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అజెండాలోని అంశాలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఇతర జల వివాదాలను కూడా చర్చించే అవకాశం ఉంది.

అన్ని ప్రాజెక్టులపైనా చర్చ

కృష్ణా, గోదావరి నదులపై ఏపీ, తెలంగాణ నిర్మిస్తు న్న ప్రాజెక్టులకు ఆయా బోర్డులతోపాటు సీడబ్ల్యూ సీ టెక్నికల్ అప్రైజల్, అపెక్సు కౌన్సిల్ ఆమోదం లేవు. ఇరు రాష్ట్రాలు ఆయా ప్రాజెక్టుల డీపీఆర్​లను ఇప్పటికీ బోర్డులకు సమర్పించలేదు. దీనివల్ల ఇరు రాష్ట్రాలు గతంలో నిర్మించిన, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల పరిధిలో ఏ మేరకు నీటిని వాడుకుంటున్నాయన్న దానిపై క్లారిటీ లేదు. ఆయా రాష్ట్రాలు చెప్పే సమాచారం తప్ప కేంద్ర జలశక్తి శాఖ వద్ద కూడా ప్రాజెక్టుల పూర్తి వివరాలు, వాటికి పొందిన పర్మిషన్ల వివరాల్లేవు. దీంతో తాజా అపెక్సు కౌన్సిల్ మీటింగ్ లో డీపీఆర్‌ లపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాలు కచ్చితంగా డీపీఆర్ లు ఇచ్చేలా సీఎంలపై కేంద్రం ఒత్తిడి తీసుకురానుంది.