
ఎక్కడికి వెళ్లినా ఫోన్, ఇయర్ బడ్స్‌తో పాటు పవర్‌బ్యాంక్ వెంట ఉండాల్సిందే. అయితే వర్షాకాలంలో ఫోన్, ఇతర గాడ్జెట్ల మీద నీళ్లు పడినా, తేమ ఎక్కువ తగిలినా బ్యాటరీ దెబ్బతిని, తొందరగా పాడవుతాయి. దాంతో అవి ఇంతకుముందులా పనిచేయవు. అలా కాకుండా ఉండాలంటే...
- వర్షంలో బయటికి వెళ్లేటప్పుడు ఫోన్ మీద నీళ్లు పడకుండా, తేమ తగలకుండా చూసుకోవాలి. జిప్ లాక్ కవర్లో పెడితే ఫోన్ తడుస్తుందేమోననే భయం ఉండదు. ప్లాస్టిక్‌తో తయారైన వీటిలో ఫోన్ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ఇయర్‌బడ్స్, పవర్ బ్యాంక్ కూడా పెట్టుకోవచ్చు.
- వర్షం పడుతున్నప్పుడు తడవకుండా ఫోన్, ఇతర గాడ్జెట్లని బ్యాగ్‌లో పెట్టుకుంటారు చాలామంది. అయితే.. బ్యాగు తడిచి తేమ ఉంటే అవి పాడయ్యే అవకాశం ఉంది. అందుకని బ్యాగ్‌లో సిలికాన్ జెల్ ప్యాకెట్స్ పెట్టుకోవాలి. ఇవి తేమను తొందరగా పీల్చుకుంటాయి. ఇవి రంగు మారిన వెంటనే తీసేసి, కొత్తవి పెట్టాలి.
- ఫోన్, పవర్ బ్యాంక్, బ్లూటూత్ హెడ్సెట్ వంటివి తడిచినప్పుడు వాటిని పొడి క్లాత్‌తో తుడవాలి. అలాకాకుండా వాటిని వెంటనే ఛార్జింగ్ చేస్తే అవి మరింత దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు ఛార్జింగ్ పెట్టేటప్పుడు చేతులు తడిగా ఉండొద్దు.
- ఈ సీజన్లో ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ నీళ్లలో తడవకుండా వాటర్‌ప్రూఫ్ లేదా వాటర్ రెసిస్టెంట్ బ్యాక్‌ప్యాక్‌లు వాడాలి. ఇవేకాకుండా వాటర్ రెసిస్టెంట్ కవర్స్ కూడా ఉన్నాయి. ఇవి ఆన్లైన్లో ఆరొందల రూపాయల నుంచి దొరుకుతున్నాయి.