వానొస్తే క్లాసు రూమ్​ల్లోకి నీళ్లు

వానొస్తే క్లాసు రూమ్​ల్లోకి నీళ్లు
  • వానొస్తే ఆగమే! క్లాసు రూమ్​ల్లోకి చేరిన నీళ్లు
  • గోడలకు పగుళ్లు, పెచ్చులతో శిథిలం
  • రెండేళ్ల నుంచి సరైన నిర్వహణ లేదు
  • ప్రమాదకరంగా సిటీలోని సర్కార్ స్కూళ్లు

హైదరాబాద్, వెలుగు: వానొస్తే సిటీలోని సర్కారు స్కూళ్లు ఆగమాగమవుతాయి.  స్టూడెంట్లు, సిబ్బంది భయంతో వణికిపోతుంటారు. చిన్నవాన పడినా బడికి సెలవు ఇస్తుంటారు.  సిటీలో మొత్తం 690 సర్కారు స్కూళ్లు ఉండగా, మొత్తం 83,841మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో10 శాతం స్కూళ్లు పాడుబడ్డాయి. మరో 30శాతం స్కూళ్లు మరమ్మతులకు ఎదురు చూస్తున్నాయి. ఈ ఏడాది ప్రైవేటు స్కూళ్ల నుంచి సర్కారు బడులకు స్టూడెంట్స్ ఎక్కువగా అడ్మిషన్లు పొందారు. ఈ నేపథ్యంలో ఉన్న బిల్డింగ్ ల్లో క్లాస్ రూమ్ లు సరిపోక,  వానాకాలంలో  పాఠాలు చెప్పలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టీచర్లు చెప్తున్నారు. గట్టివాన కొడితే కొన్ని స్కూళ్లు మునిగిపోతుండగా, మరికొన్ని స్కూళ్ల గోడలు  కూలిపోయే స్థితిలో ఉన్నాయి.

రెండేళ్లుగా సరైన నిర్వహణ లేక..
షేక్ పేట్ బీజేఆర్ నగర్ లోని గవర్నమెంట్​ ప్రైమరీ స్కూల్ పరిస్థితి దారుణంగా ఉంది.  నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ఒకే టీచర్ ఉండగా, వానొస్తే స్కూల్  వరదతో నిండిపోతుంది.  అండర్ గ్రౌండ్ లో ఉండగా మోటర్లతో నీళ్లు బయటకు పంపిస్తారు.   తెల్లారి మళ్లీ అలాగే  స్కూల్ చుట్టూ, క్లాస్ రూమ్​ల్లో నీళ్లు, పాకురు పేరుకు పోయి ఉంటుంది.  పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి ఉంది.  వరదనీళ్లలోనే క్లాసులు కండక్ట్ చేస్తుంటారు. మంగళవారం కురిసిన వర్షాలతో స్కూల్ లో నీళ్లు నిలిచిపోయాయి.  ఎవరు  పట్టించుకోరని  స్థానికులు అంటున్నారు. బాలానగర్ లోని జెడ్పీ హైస్కూల్ లో కూడా వరదనీళ్లు నిలిచిపోయాయి. స్కూల్ గ్రౌండ్ మొత్తం నీళ్లతోనే ఉంది. అనేకప్రాంతాల్లోని సర్కారు స్కూళ్లలో ఇదే పరిస్థితి ఉంది. లాక్ డౌన్, కరోనా కారణంగా రెండేళ్ల నుంచి సర్కారు స్కూళ్ల కు నిర్వహణ కరువైంది. మొన్నటివరకు పిచ్చిమొక్కలతో దర్శనమిచ్చిన స్కూళ్లకు ఇప్పుడు వరదనీరు మరో సమస్యగా మారింది.

పెచ్చులూడుతున్న గోడలు 
సర్కార్​ స్కూళ్లు చాలా వరకు పాత బిల్డింగ్ లలోనే నడుస్తున్నాయి. కొన్ని బిల్డింగ్ గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. మరికొన్ని గోడలకు రంధ్రాలు పడ్డాయి. క్లాస్ రూమ్ ల్లోని పై కప్పులు పెచ్చులూడుతున్నాయి. కొన్ని గోడలు ఏ క్షణమైనా కూలిపోయేలా ఉన్నాయి. అలాంటి స్కూళ్లలో క్లాసులు చెప్పడం ప్రమాదకరమని టీచర్లు, హెడ్ మాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఫీల్డ్ లో చెక్ చేయించాలె 
సర్కారు స్కూళ్లలో సమస్యలున్నాయి. చాలా స్కూళ్లు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని స్కూళ్లలో అదనపు గదులు లేవు.  సర్కార్​ వెంటనే స్పందించి  ఫీల్డ్ లెవల్ లో  చెక్​ చేయించాలి. కూలిపోయే బిల్డింగ్ లను కూలగొట్టి కొత్తవి కట్టాలి.  ఈసారి స్టూడెంట్స్ సంఖ్య పెరిగినందున అదనపు బిల్డింగ్ లు నిర్మించాలి.
- రవి, రాష్ట్ర అధ్యక్షుడు, టీఎస్ యూటీఎఫ్