ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందంటున్న నిపుణులు

ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందంటున్న నిపుణులు
  • ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందంటున్న నిపుణులు
  • పట్టించుకోని ప్రభుత్వం.. ఆందోళన చెందుతున్న జనం

భైంసా,వెలుగు : భైంసా, లోకేశ్వరం మండలాల్లో14 వేల ఎకరాలకు నీరందించాలనే ఉద్దేశంతో 15 ఏళ్ల క్రితం 1.852 నీటి నిల్వ సామర్థ్యంతో కట్టిన గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు గడ్డుకాలం వచ్చింది. ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి నిర్వహణ సరిగా లేకపోవడంతో పరిస్థితి చేజారుతోంది. కొన్ని నెలల క్రితం మరమ్మతుల కోసం రూ. 60 కోట్లు అవసరమని ఇరిగేషన్​ ఆఫీసర్లు ప్రతిపాదించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు వరుసగా కురుస్తున్న వర్షాలు.. వరద కారణంగా ఇప్పుడు ఫ్లడ్​ బ్యాంకులు (వరద కట్టలు) తెగిపోయాయి. ప్రాజెక్టు 2, 3 గేట్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ. కోటి నష్టం వాటిల్లిందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. తూములు, పిల్ల కాల్వలు, అక్విడెక్ట్​లు శిథిలమయ్యాయి. గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువన ఉన్న ఫ్లడ్ బ్యాంకులు కొట్టుకుపోయి పంట పొలాల్లోకి చేరాయి. 

పూర్తికాని పనులు...
ప్రాజెక్టు మెయిన్​ కెనాల్​ 42 కిలో మీటర్ల పొడువు ఉంది. పదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం కాల్వ రిపేర్ల కోసం రూ. 20 కోట్లు రిలీజ్​ చేసింది. వాటితో 30 కి.మీ మేర పనులు చేశారు. మిగితా 12 కి.మీ పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు భైంసా శివారు, వాలేగాం, లోకేశ్వరం మండలాల ఏరియాలో మెయిన్ కెనాల్​కు గండ్లు పడ్డాయి. ఫలితంగా రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.

మూడు నెలల క్రితమే...
భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు మూడు నెలల క్రితం డీఎస్ఆర్పీ (డ్యాం సేఫ్టీ రిహాబిటేషన్​ ప్రొగ్రాం) ఆఫీసర్లు సందర్శించారు. ప్రధాన కాల్వలను పరిశీలించారు. గేట్లు, ఫ్లడ్ బ్యాంకులు (ఇరువైపులా వరద కట్టలు)  గమనించి మరమ్మతులు అవసరమని సూచించారు. 500 మీటర్ల పొడవునా కట్టలు నిర్మించాలన్నారు. దీని కోసం రూ.6 కోట్లు కావాలని ప్రతిపాదించారు. 

ప్రతిపాదనలు పంపినా..
గడ్డెన్న ప్రాజెక్టు స్పిల్ వే కింది భాగంలోని ఇరువైపులా ఫ్లడ్ బ్యాంకుల నిర్మాణానికి రూ. 6 కోట్లు, గ్యాంట్రి క్రేన్​కోసం రూ.7 కోట్లు కావాలని ఆఫీసర్లు ప్రభుత్వానికి నివేదించారు. మెయిన్​ కెనాల్ ​ఆధునికీకరణ, మిగితా 12 కిలో మీటర్ల  లైనింగ్,​ పిల్ల కాల్వల నిర్మాణం కోసం రూ. 36  కోట్లు, స్పిల్​వే దిగువన 200 మీటర్ల దూరంలో సుద్దవాగుపై, పలు గ్రామాల వద్ద కాలువలపై బ్రిడ్జీల నిర్మాణం కోసం రూ. 2 కోట్లు, డ్రిప్​(డ్యాం రిహాబిటేషన్​ ప్రోగ్రాం) కోసం మరో రూ.9 కోట్లు అవసరమని పేర్కొన్నారు.

 ప్రతిపాదనలు పంపాం
గడ్డెన్న వాగు ప్రాజెక్టు ఫ్లడ్​ బ్యాంకులు ఇప్పటికే వరద తాకిడికి కొట్టుకుపోగా రూ. కోటి వరకు నష్టం జరిగింది. మూడు నెలల క్రితమే డీఎస్ఆర్పీ బృందం పరిశీలించి రిపేర్లు చేయాలని చెప్పింది. రూ. 60 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించాం. నిధులు రాగానే ప్రాజెక్టును అభివృద్ధి చేస్తాం.
– శ్రీనివాస్, ప్రాజెక్టు డీఈఈ