
హైదరాబాద్, వెలుగు : వాటర్ బోర్డు చాలెంజ్‌గా తీసుకున్న పైలట్ ప్రాజెక్ట్ ఏరియాలోనూ నీటి కష్టాలు తప్పడం లేదు. నీటి సరఫరాను మెరుగుపర్చడం, వేస్టేజీని అరికట్టడం, రెవెన్యూ పెంచడం లక్ష్యంగా గతేడాది నవంబర్‌లో సెలెక్ట్ చేసుకున్న సనత్ నగర్ సెగ్మెంట్‌లో ఆశించిన రిజల్ట్ కనిపించడం లేదు. 6 నెలల నుంచి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నా, బస్తీ జనాలకు వారానికొకసారే నీళ్లందుతున్నాయి.
సనత్‌నగర్ సెగ్మెంట్‌లోని ఫతేనగర్, ఎస్ ఆర్‌నగర్, ప్రకాశ్‌నగర్, బోయిగూడ, నల్లగుట్ట, హుస్సేన్ సాగర్ పంప్ హౌస్‌ల పరిధిలో వాటర్ బోర్డు నల్లా కనెక్షన్లు 31,965 ఉన్నాయి. 212 కిలోమీటర్ల పైపు లైన్ ద్వారా డైలీ 626.52 లక్షల లీటర్ల నీరు సరఫరా అవుతోంది. హడ్కో నిధులతో 5 ఎంఎల్ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ను గతేడాది నవంబర్‌లో ప్రారంభించారు. సనత్‌నగర్‌లో ఇక తాగునీటి సమస్యలుండవని అప్పట్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, వాటర్ బోర్డు ఉన్నతాధికారులు ప్రకటించారు. తొలి ప్రాధాన్యంగా పైలట్ ప్రాజెక్టు చేపట్టినా నేటికీ బస్తీల్లో నీటి ఎద్దడి తీరలేదు.
దాసారం బస్తీలో…
300 గుడిసెలున్న దాసారం బస్తీలో 3నల్లాలు మాత్రమే ఉన్నాయి. వాటర్‌బోర్డు అధికారులు డే బై డే ఒక ట్యాంకర్ పంపిస్తున్నారు. 30 కుటుంబాలకు ఒకసారి నీళ్లు ఇస్తుండగా, స్థానికులు కొన్ని డ్రమ్ములు ఒకచోట పెట్టి వాటిల్లో పట్టుకుంటున్నారు. తమ వంతు మళ్లీ డ్రమ్ములు నిండాలంటే కనీసం వారం, పది రోజులు పడుతోందని బస్తీవాసులు వాపోతున్నారు. పక్కనే ఉన్న కాలనీలో రోజు విడిచి రోజు నీళ్లొస్తున్నా, తాము వారం దాకా ఆగాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. బస్తీ చివరున్న ఓపెన్ నల్లా నుంచి ఇంటికి 2 బిందెల చొప్పున పట్టుకుంటున్నామని తెలిపారు. అది కూడా చిన్నగా వస్తోందని, గంటకు మించి రావడం లేదని పేర్కొన్నారు.
వృథా తగ్గలే
పైలట్ ప్రాజెక్టులో భాగంగా వాటర్ వేస్టేజీని అరికట్టేందుకు అధికారులు ఇంటింటికీ మార్కింగ్ వేశారు. వృథా ఎక్కువుంటే రెడ్, కొంత తక్కువుంటే ఆరెంజ్, అసలే లేకుంటే గ్రీన్, వాటర్ వేస్టేజ్ లేకపోవడంతోపాటు ఇంట్లో ఇంకుడు గుంత ఉంటే బ్లూ కలర్ ఇచ్చారు. ఆ తర్వాత వాటిని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. పైప్లైన్లు కూడా పూర్తిస్థాయిలో మెరుగుపర్చలేదు. మొదట్లో ఇక్కడ 40 శాతం నీటి వృథా ఉండగా, ఏడాది లోపల 30శాతానికి తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నారు. 6 నెలలు అవుతున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. కమర్షియల్ ఏరియా అవడంతో సనత్ నగర్, ఏఆర్ నగర్ లో సమ్మర్ లో తాగునీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో కమర్షియల్ యాక్టివిటీస్ లేకున్నా నీటి ఎద్దడి మాత్రం తీరలేదు.
సగం డ్రమ్ములు గూడ నిండవు
రోజు విడిచి రోజు ట్యాంకర్ వస్తోంది. 30 ఇండ్లకు కలిపి కొన్ని డ్రమ్ములు పెట్టుకున్నం. ఒక్కో గ్రూపు ఒక్కో రోజు పట్టుకుంటాం. మా వంతు మళ్లీ రావడానికి వారం రోజులు పడుతుంది. ఒక్కోసారి సగం డ్రమ్ములు కూడా నిండుతలేవు.
‑ సుజాత, దాసారం బస్తీ
ఎటూ సరిపోట్లే..
మా ఇంట్లో ఐదుగురం ఉంటం. ట్యాంకర్ నీళ్లు ఎటూ సరిపోతలేవు. మాకు రెండు డ్రమ్మున్నర వస్తే ఇంటి అవసరాలకు కూడా చాలట్లేదు. వాటర్ క్యాన్ కొనుక్కొని తాగుతున్నాం.
‑ లక్ష్మి, దాసారం బస్తీ