భారీ వ‌ర్షాలు.. నీళ్లలోనే కాలనీలు

భారీ వ‌ర్షాలు.. నీళ్లలోనే కాలనీలు

వరంగల్ నగరంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
మునిగిన లక్నవరం వంతెన..ఆసిఫాబాద్లో ఒకరి గల్లంతు
భద్రాచలంలో ప్రమాదకర స్థాయిలో గోదావరి వరద ప్రవాహం

వరంగల్/ములుగు/భద్రాచలం, వెలుగు:ఓరుగల్లు నగరం వరద నీటిలో మునిగింది. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టుప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. వరద ఉద్ధృతి శనివారం ఉదయం నుంచి ఆదివారం కూడా కొనసాగడంతో జనజీవనం మొత్తం స్తంభించింది. రోడ్లన్నీ కాల్వల్లా మారాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం జీడబ్ల్యూఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ న్డీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి . దాదాపు 20 మంది ఎన్డీఆర్న్డీ ఎఫ్ సిబ్బంది లైఫ్ బోట్లు, లైఫ్ జాకెట్లతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు . వీటితో పాటు జీహెచ్ ఎంసీ నుంచి మూడు డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. 36 మందితో కూడిన టీంలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఆదివారం కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటంతో ముంపు ప్రాంతాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ వినయ్భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, అధికారులతో కలిసి పరిశీలించారు.

నయీంనగర్, సమ్మయ్యనగర్, సరస్వతినగర్, హంట్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ముంపు బాధితుల కోసం 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 2600 మందికి అందులో ఆశ్రయం కల్పించారు. జిల్లాలో ఆదివారం 711.1 మిల్లీమీటర్ల వర్ష‌పాతం నమోదు కాగా.. హన్మకొండ మండలంలో 135.4 మి.మీ. వర్ష‌పాతం నమోదైంది. హంటర్ రోడ్డులోని బొందివాగు ప్రాంతంలో 13 ట్రాన్స్ ఫార్మర్ల బాక్సుల వరకు నీళ్లు చేరడంతో ఆయా ఏరియాలకు కరెంట్ సరఫరా నిలిపేశారు. రోడ్లపై వరద ప్రవాహం ఎక్కువ కావడంతో హన్మకొండ బస్టాండ్ ఏరియా, సమ్మయ్యనగర్ తదితర చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి.

నిండిన రామప్ప, లక్నవరం..

ములుగు జిల్లారామప్ప, లక్నవరం సరస్సులు వరద ఉద్ధృతికి నిండి పోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోకురిసిన వర్షాలకు బొగ్గులవాగు ఉధృతంగా ప్రవహించడంతో లక్నవరం సరస్సులోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఉయ్యాల వంతెన(సస్పెన్షన్బ్రిడ్జి) సైతం మునిగిపోయింది. 36 ఫీట్ల నీటి నిల్వ సామర్యం కలిగిన రామప్ప 35 ఫీట్లకు చేరుకోగా 34
ఫీట్లనీటినిల్వ సామర్యం్థ కలిగిన లక్నవరం నిండి పోయి మత్తళ్లు దుముకుతున్నాయి.

భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదారి ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదస్థాయిలో ప్రవాహం ఉండటంతో ఆదివారం జిల్లా కలెక్ట‌ర్ ‍డా.ఎం.వి.రెడ్డి మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఉదయం 7 గంటలకు 48.70 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, మధ్యాహ్నం 1.50గంటలకు 53 అడుగులకు చేరుకోగానే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రవాహం 54.40 అడుగులు ఉంది. ప్రస్తుతం 14,06,363 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. భద్రాచలం మన్యం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. దిగువన శబరి ఉపనదికి వరద పోటెత్తుతోంది. ఎగువన తాలిపేరు, కాళేశ్వరం, మేడిగడ్డల నుంచి కూడా వరద వస్తోంది. దీంతో జిల్లా కలెక్ట‌ర్ ఆఫీసర్ల‌ను అప్రమత్తం చేశారు. భద్రాచలం రామాలయం చుట్టూ వరద చేరింది. అశోక్‍నగర్ కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీల్లోకి వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

మేకల కాపరి గల్లంతు

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగేడ గ్రామంలో రాళ్లవాగు దాటుతూ మేకల కాపరి పాలగాని బాపు గల్లంతయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..