
సిద్దిపేట, వెలుగు: గత నెల 30న భారీ వరదల కారణంగా సిద్దిపేట జిల్లాలో నీటమునిగిన హైదరాబాద్ మెట్రో వాటర్ పంప్‌హౌజ్ ఇంకా రిపేర్ కాలేదు. పది రోజులు గడుస్తున్నా ఆరు పంపులకు గాను ఇప్పటివరకు కేవలం రెండు పంపులే రిపేర్ చేయగలిగారు. దీంతో హైదరాబాద్ తో పాటు సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 1950 హబిటేషన్ లకు మిషన్‌భగీరథ వాటర్సప్లైకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. హైదరాబాద్‌కు ఇతర మార్గాల నుంచి సప్లై చేస్తున్నప్పటికీ మిగిలిన జిల్లాల్లో పబ్లిక్తాగునీటికి తిప్పలు పడుతున్నారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం వద్ద ఉన్న హైదరాబాద్ మెట్రో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ నుంచి జిల్లాలోని మూడు నియోజకవర్గాలతోపాటు జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు తాగునీటిని సప్లై చేస్తుంటారు. వారం క్రితం మల్లారంలోని 6.6 కేవీ పంప్ హౌజ్ లోకి వరద నీరు చేరడంతో అందులోని ఆరు పంప్ లు పనిచేయకుండా పోయాయి. దాంతో మొదటి రెండు రోజులు మిషన్ భగీరథ జలాల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఆఫీసర్లు మూడు నాలుగు రోజుల్లో రిపేర్లు పూర్తి చేసి పంపులను యథావిధిగా నడిపిస్తామని చెప్పారు. కానీ పది రోజుల్లో కేవలం రెండు పంపులు మాత్రమే వినియోగంలోకి వచ్చాయి. వీటితో కొద్ది మొత్తంలో నీటిని వదులుతున్నారు. గజ్వేల్, దుబ్బాక, జనగామ నియోజకవర్గాల్లో రోజు విడిచి రోజు నీటిని సప్లై చేస్తున్నారు. ప్రతి రోజు మూడు నియోజకవర్గాలకు 45 ఎంఎల్ డీ నీటిని సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం రోజు విడిచి రోజు 25 ఎంఎల్ డీ నీటిని ఇస్తున్నారు. దీంతో చాలా గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతోంది.
ట్యాంకర్లతో సరఫరా
సిద్దిపేట జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు కొద్ది రోజులుగా సరిపడా మిషన్ భగీరథ జలాలు సరఫరా కాకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు మొదలయ్యాయి. మిగిలిన 4 పంపులు రిపేర్చేయడానికి మరికొద్దిరోజులు పట్టే అవకాశం ఉండడంతో ఆఫీసర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గజ్వేల్, దుబ్బాక, జనగామ నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోనూ ఇదే పరిస్థితి. గజ్వేల్ మున్సిపాల్టీ పరిధిలో నీటి సరఫరా సరిగా లేక నాలుగు రోజులుగా ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. గతంలో గ్రామాల్లో తాగు నీటి అవసరాల కోసం గ్రామీణ నీటి పారుదల శాఖ తరఫున బోర్లకు సింగిల్, త్రీ ఫేజ్ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని సప్లై చేసేవారు. మిషన్ భగీరథ అమలులోకి వచ్చిన తరువాత నిధుల కొరత సాకుగా చూపి సింగిల్, త్రీ ఫేజ్ బోర్లు మూలకు చేర్చారు. వీటికి రిపేర్లు సైతం చేయక ప్రస్తుతం ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోయింది.
రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో పంపింగ్
మల్లారం పంప్ హౌజ్‌లో ప్రస్తుతం రెండు మోటార్లు పూర్తి స్థాయిలో పని చేస్తుండగా మిగిలిన నాలుగింటికి రిపేర్లు చేయిస్తు న్నాం. ప్రస్తుతం రెండు మోటార్లతో జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో రోజు విడిచి రోజు 25 ఎంఎల్ డీ నీటిని సప్లై చేస్తున్నాం. కొన్నిచోట్ల తాగునీటి అవసరాల కోసం ట్యాంకర్లతో సప్లై చేస్తున్నాం.
- శ్రీనివాస చారి, ఈఈ, ఆర్ డబ్ల్యూఎస్