ఢిల్లీ జల మండలి ఆఫీసుపై జనం దాడి

ఢిల్లీ జల మండలి ఆఫీసుపై జనం దాడి
  • ట్యాప్ వాటర్ రావట్లేదంటూ ఆగ్రహం
  • మట్టి కుండలు విసిరేస్తూ కిటికీ అద్దాలు ధ్వంసం

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు హీట్ వేవ్స్ కొనసాగుతుండగా.. మరోవైపు తాగు నీటి తిప్పలు పెరుగుతున్నాయి. అనేక చోట్ల జనం నీళ్ల కోసం కొట్లాటలకు దిగుతున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆదివారం ఛత్తార్​పూర్ లోని ఢిల్లీ జల మండలి ఆఫీసుపై కొందరు స్థానికులు దాడి చేశారు. మట్టి కుండలు తెచ్చి విసిరికొట్టడంతో ఆఫీసు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ ట్విట్టర్​లో షేర్ చేసింది. అలాగే ఢిల్లీలోని ద్వారక జిల్లాలోని ఓ ఏరియాలో నీళ్ల కోసం ఇరు వర్గాల మధ్య గొడవ జరగడంతో ముగ్గురు గాయపడ్డారు. రెండు వర్గాల నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ఢిల్లీలో నీటి సంక్షోభంపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఢిల్లీ జల్ బోర్డ్ ఆఫీసుపై దాడి చేసేలా ప్రజలను బీజేపీ నేతలు రెచ్చగొడ్తున్నారంటూ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. సంబంధిత దాడి వీడియోను ట్విట్టర్​లో షేర్ చేశారు. దీనిపై బీజేపీ నేత రమేశ్ బిధూరి స్పందిస్తూ.. ఢిల్లీలోని ఆప్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని, ఢిల్లీ జల్ బోర్డ్ లో ఆడిటింగ్ కూడా చేయడంలేదన్నారు. జల్ బోర్డ్ రూ.70 వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయినందుకే నీటి సంక్షోభం వచ్చిందన్నారు. జల్ బోర్డ్ ఆఫీసుపై దాడి చేసిన వారిని తమ కార్యకర్తలు కంట్రోల్ చేశారని ఆయన మెచ్చుకున్నారు. ఢిల్లీలో నీటి సంక్షోభానికి నిరసనగా బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మట్కా ఫోఢ్ (మట్టి కుండలను పగలగొట్టడం) కార్యక్రమం చేపట్టారు. ఆప్ సర్కారుకు వాటర్ పాలసీ అంటూ లేనందుకే ఏటా సంక్షోభం వస్తోందన్నారు.