వయనాడ్ విషాదం: ప్రకృతి విపత్తు ఫోటోలు విడుదల చేసిన ఇస్రో

వయనాడ్ విషాదం: ప్రకృతి విపత్తు ఫోటోలు విడుదల చేసిన ఇస్రో

కేరళలో భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. దీంతో ముఖ్యంగా వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రళయం వందల మందిని బలితీసుకుంది. వయనాడ్ జిల్లాలో కొండ చరియల విరిగిపడి కొన్ని గ్రామాలు నేలమట్టమయ్యాయి. వయనాడ్ ప్రకృతి విపత్తును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో తాజాగా శాటిలైట్ ఫోటోల రూపంలో విడుదల చేసింది. కొండ చరియలు విరిగిపడక ముందు ఆ ప్రాంతానికి సంబంధించిన ఫోటోలు.. ప్రకృతి విలయతాండవం చేసిన తర్వాత ఫోటోలను విడుదల చేసింది.

వయనాడ్‌ జిల్లాలో 1500 మీటర్ల ఎత్తులో ఉన్న కొండచరియలు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రళయం చోటు చేసుకుంది. వయనాడ్ ప్రకృతి విపత్తుకు చెందిన శాటిలైట్ హై రెజల్యూషన్‌తో తీసిన ఫొటోలను ఇస్రో గురువారం విడుదల చేసింది. ఇస్రోకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) అధునాతన కార్టోశాట్-3 ఆప్టికల్ శాటిలైట్ ఈ ఫోటోలను తీసి పంపించింది. 

ఇందులో వయనాడ్ చుట్టు పక్కల ఉన్న గ్రామాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల అక్కడ జరిగిన నష్టం అంతరిక్షం నుంచి తీసిన ఆ ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు 86 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో భూమి కొండపై నుంచి కిందికి జారిపోయిందని వెల్లడైంది.

ఇక ఆ లోయకు రెండు వైపులా 8 కిలోమీటర్ల మేర వరద ప్రవహించింది. ఆ ఫొటోల్లో కొండచరియలు కూలిన భాగం స్పష్టంగా కనిపిస్తోంది. ఇళ్లు, చెట్లు, బిల్డింగులు ఆ వరదకు కొట్టుకుపోయినట్లు అందులో చూపిస్తోంది. ఇక ఘటనా స్థలిలో రెస్క్యూ బృందాల సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇక కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు విరిగిపడుతున్న కొండచరియలు గ్రామాలకు గ్రామాలనే ఆనవాళ్లు లేకుండా చేస్తున్నాయి. ఇందులో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 

కేరళలో గత 2 వారాలుగా కురుస్తున్న వర్షాలకు వయనాడ్‌ ప్రాంతం మొత్తం తడిగా మారిపోయిందని అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్‌ఫెరిక్‌ రాడార్‌ రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ నిపుణులు తెలిపారు. అరేబియా సముద్ర తీరంలో దట్టమైన మేఘాల ధోరణిని శాస్త్రవేత్తలు ముందుగానే గుర్తించారని చెప్పారు. ఈ కారణంగా కేరళలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత భారీ వర్షాలు పడి కొండచరియలు విరిగిపడే అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.