ధోనీని బాగా మిస్సవుతున్నాం: కుల్దీప్ యాదవ్

ధోనీని బాగా మిస్సవుతున్నాం: కుల్దీప్ యాదవ్

న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌ కప్ తర్వాత నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రికెట్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సమ్మర్‌‌లో ఐపీఎల్‌ ద్వారా బరిలోకి దిగుదామని భావించినా.. కరోనా వ్యాప్తితో టోర్నీ తాత్కాలికంగా వాయిదా పడింది. దీంతో మహీని మళ్లీ గ్రౌండ్‌లో చూడాలన్న ఫ్యాన్స్ కోరికతోపాటు పలువురు సహచర ఆటగాళ్ల ఆశలకు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా ధోనీని తాను వ్యక్తిగతంగా చాలా మిస్ అవుతున్నానని మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పాడు. టీమిండియా తరఫున మహీ మళ్లీ బరిలోకి దిగాలని తాను కోరుకుంటున్నానని తెలిపాడు.

‘మేం అందరం మహీ భాయ్‌ను మిస్సవుతున్నాం. నేను ధోనీకి పెద్ద ఫ్యాన్‌ను. అతడు త్వరలోనే టీమ్‌లోకి తిరిగి రావాలని, జట్టుకు ఆడాలని కోరుకుంటున్నా. ఇండియాకు ధోని ఆడాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. మేం ఎప్పుడు ఫీల్డ్‌లోకి అడుగుపెట్టినా మహీ మంచి సూచనలతో ముందుకొచ్చేవాడు. అలాంటి అడ్వయిజ్‌లు నా కెరీర్‌‌కు ఎంతో హెల్ప్‌ అయ్యాయి. అతడు గేమ్‌కు ముందు, తర్వాత ఎలాంటి సూచనలు ఇవ్వడు. ఆట జరుగుతున్నప్పుడు ఫీల్డ్‌లో పరిస్థితులను గమనించి వెంటనే అడ్వయిజ్‌లు ఇస్తాడు. విరాట్‌ కూడా ఇదే చేస్తాడు. కోహ్లీ గ్రేట్ మోటివేటర్. వీళ్లిద్దరినీ మినహాయిస్తే రోహిత్ కూడా నన్ను చాలా సార్లు గైడ్ చేశాడు. ఇలాంటి సీనియర్స్‌తో కలసి ఆడటాన్ని అదృష్టంగా భావిస్తున్నా’ అని కుల్దీప్ పేర్కొన్నాడు.