- ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేతో దేశానికి రోల్ మోడలయ్యాం
నిజామాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న ప్రజాపాలన సామాజిక న్యాయానికి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగానే దశాబ్దాలుగా నలిగిన ఎస్సీ వర్గీకరణను అమలు చేయడమే కాకుండా, కుల సర్వేతో జనాభా లెక్కలు తీసి సంక్షేమ స్కీమ్‌లు అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆదివారం నిజామాబాద్‌లోని చంద్రశేఖర్‌నగర్ కాలనీ చౌరస్తాలో అన్నాభావు సాఠే విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలోని అన్ని కులాలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వాలనే రాహుల్‌గాంధీ సంకల్పం నేరవేరేలా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబాలకు తమ సర్కార్ అండగా ఉంటోందన్నారు.
మహిళకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేసి తరువాత అభివృద్ధిపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాలని సూచించారు. అన్నాభావు సాఠే పేదలు, అణగారినవర్గాల పరిస్థితిని తన రచనలతో ప్రతిబింబించారని తెలిపారు. సామాజిక అసమానతలు, అన్యాయాలపై ఆయన కలంతో చేసిన పోరాటాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
దళితులు అన్నింటాఎదగాలి: మంత్రి అడ్లూరి
దళిత సమాజం ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగితేనే సామాజిక మార్పు సాధ్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. మాదిగ వర్గం నుంచి గెలిచిన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అభివృద్ధిలో ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు. అన్నాభావుసాఠే నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, మేయర్ ఉమారాణి, డీసీసీ ప్రెసిడెంట్ నగేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, డి.రాజేశ్వర్, నరాల రత్నాకర్ ఉన్నారు.
