- వచ్చే నెల నుంచి రెండు లక్షల మందికి కొత్త పింఛన్లు
- బీఆర్‌ఎస్ హయాంలో హరీశ్‌రావు అమలు కాని బడ్జెట్‌ను ప్రవేశపెట్టిండని వ్యాఖ్య
కోల్‌బెల్ట్, వెలుగు: మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌తో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మందమర్రి పట్టణంలోని విద్యానగర్, సీఈఆర్ క్లబ్ సమీపంలోని ఈద్గాల వద్ద ముస్లింలతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో మంత్రి పాల్గొన్నారు.
అనంతరం క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీలు, జైపూర్ మండల కేంద్రానికి చెందిన పలువురు ముస్లిం నేతలు, కుటుంబాల ఇండ్లకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల నుంచి 2 లక్షల మందికి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్‌రావు అమలు కాని బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఆరోపించారు. కేసీఆర్ పదేండ్లలో తెలంగాణను రూ.8లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఫర్టిలైజర్ కొరత లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, హిందువులు, ముస్లింలు ఐక్యతగా మెలగాలని మంత్రి సూచించారు.
- ముస్లిం మహిళలకు కుట్టు మెషీన్లు పంపిణీ
చెన్నూరు పట్టణంలోని మైనార్టీ షాదీఖానాలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద మంజూరైన 365 కుట్టు మెషీన్లను ముస్లిం మహిళలకు కలెక్టర్ కుమార్ దీపక్, మైనార్టీ శాఖ ఆఫీసర్ రాజేశ్వరి, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డితో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఈద్గా, దర్గాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
ముస్లింలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, తాను అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మందమర్రిలో రూ.50 లక్షలతో షాదీఖానా, ఈద్గా చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సింగరేణి సంస్థతో మాట్లాడి ఈద్గా వద్ద కమాన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు.
నియోజకవర్గానికి చెందిన మహిళలు తమకు కుట్టు మెషీన్లు అందించాలని కోరారని, ఈ విషయాన్ని మైనార్టీ మంత్రి అజారుద్దీన్ దృష్టికి తీసుకువెళ్లడంతో చెన్నూరు నియోజకవర్గానికి 400 కుట్టు మెషీన్లు మంజూరు చేశారన్నారు. 365 మందికి కుట్టు మెషీన్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి మహిళలకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్, మైనార్టీ శాఖ ఆఫీసర్‌కు మంత్రి సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ పేరుతో ఇండ్లు మంజూరు చేశామని, ఇప్పుడు కుట్టు మెషీన్లు పంపిణీ చేసినట్టు చెప్పారు. స్కూల్, హాస్టల్ స్టూడెంట్లకు యూనిఫామ్స్ కుట్టే అవకాశం ముస్లిం మహిళలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
- మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ సర్పంచ్‌లు
మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ సర్పంచులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నూరు మండలం చెల్లాయిపేట, భీమారం మండలం ఖాజీపల్లి గ్రామాల బీఆర్ఎస్ సర్పంచ్‌లు చెలిమల స్వరూప, కొండ శ్యామల, ఉప సర్పంచ్‌లు సుందిళ్ల అంకయ్య, దయ్యాల లక్ష్మి, పలువురు వార్డు సభ్యులు, సీనియర్ లీడర్లు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి అన్నారు.
అనంతరం రూ.1.87 కోట్లతో చెన్నూరు పట్టణంలోని కుమ్మరికుంట చెరువు పునరుర్జీవ పనులకు, చెన్నూరు మండలం అంగ్రాజ్‌పల్లి గ్రామంలో రూ.9లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట డీసీపీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ నాయకపు వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ ప్రసాద్ తివారీ, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, స్థానిక కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
