క్రిప్టో వద్దు.. కరెన్సీనే ముద్దు!

క్రిప్టో వద్దు.. కరెన్సీనే ముద్దు!

న్యూఢిల్లీ: దేశంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీపై క్రిప్టోకరెన్సీల ప్రభావాన్ని గురించి ఆందోళన చెందుతున్నామని ఆర్‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌ శక్తికాంత దాస్‌‌ బుధవారం పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి వివరించామని తెలిపారు. ‘క్రిప్టోకరెన్సీలకు సంబంధించి అనేక సమస్యలున్నాయి. వీటిపై ప్రభుత్వంతో చర్చించాం.ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచిస్తోంది. ఈ ఇష్యూపై  త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ అవసరమనుకుంటే పార్లమెంట్‌‌ కూడా క్రిప్టోకరెన్సీలకు సంబంధించి ఓ నిర్ణయానికి వస్తుంది’ అని దాస్‌‌ పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ రెండింటిని వేరుగా చూడాలని చెప్పారు. బ్లాక్‌‌ చెయిన్‌‌ టెక్నాలజీ వలన బెనిఫిట్స్ ఉన్నాయని, కానీ ఆర్థిక స్థిరత్వానికి సంబంధించి క్రిప్టోలపై ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. మనీలాండరింగ్‌‌, చట్ట విరుద్ధమైన పనులకు ఈ కరెన్సీలను వాడే అవకాశాలుంటాయని గతంలో ఆర్‌‌‌‌బీఐ చెప్పింది. ప్రభుత్వం త్వరలో క్రిప్టో కరెన్సీ బిల్లును తీసుకురానుంది. ఈ బిల్లులోనే అఫీషియల్ డిజిటల్‌‌ కరెన్సీని తీసుకురావడం గురించి కూడా ఉండనుంది. డిజిటల్‌‌ కరెన్సీని తీసుకురావడానికి ఆర్‌‌‌‌బీఐ రెడీగా ఉందని దాస్‌‌ అన్నారు. ‘డిజిటల్ కరెన్సీ తీసుకురావడంపై వర్క్‌‌ జరుగుతోంది. టెక్నాలజీ పరంగా, ఎలా లాంచ్ చేయాలనే దానిపై ఆర్‌‌‌‌బీఐ టీమ్‌‌ పనిచేస్తోంది’ అని దాస్‌‌ చెప్పారు. డిజిటల్ కరెన్సీ ప్రాజెక్ట్‌‌పై దృష్టి పెట్టామని, అడ్డంకులను పరిష్కరిస్తున్నామని దాస్ చెప్పారు. డిజిటల్‌‌ కరెన్సీ తీసుకొస్తే  వర్చువల్ కరెన్సీలు తెచ్చిన సెంట్రల్‌‌ బ్యాంకుల సరసన ఆర్‌‌‌‌బీఐ కూడా చేరుతుంది. చైనా ఇప్పటికే డిజిటల్ కరెన్సీ యువాన్‌‌ను తెచ్చిన విషయం తెలిసిందే. ఇన్‌‌ఫ్లేషన్ కట్టడిపై ఆర్‌‌‌‌బీఐ ఇంటర్నల్ గ్రూప్ పనిచేస్తోందని దాస్ అన్నారు. కన్జూమర్‌‌‌‌ ప్రైస్‌‌ ఇండెక్స్‌‌ లేదా రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్‌‌ను 4 శాతం(+/-– 2%) గా ఉండాలని మానిటరీ పాలసీ ఫ్రేమ్‌‌ వర్క్‌‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. మార్చి చివర్లో దీనిపై ఆర్‌‌‌‌బీఐ రివ్యూ చేయనుంది.

బిట్‌కాయిన్‌ 5 డాలర్లకు వచ్చినా..కొనను: జున్‌జున్‌వాలా

ఐదు డాలర్లకు కూడా బిట్‌‌‌‌కాయిన్‌‌ను కొననని సీనియర్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌‌జున్‌‌వాలా అన్నారు. ‘కరెన్సీలను క్రియేట్ చేసే అధికారం కేవలం ప్రభుత్వాలకే ఉంటుంది. ప్రజలు రేపొద్దున మరో 5 లక్షల బిట్‌‌కాయిన్లను పొడ్యూస్‌‌ చేస్తారు. అప్పుడు పరిస్థితేంటి? ప్రతి రోజు 5–10 శాతం కిందకి పైకి కదిలే వాటిని కరెన్సీ అనాలా?’ అని పేర్కొన్నారు. ఏ రోజైనా డాలర్‌‌‌‌ 1–2 శాతం పెరిగినా లేదా తగ్గినా అది పెద్ద న్యూస్‌‌ అని, కానీ బిట్‌‌కాయిన్‌‌ రోజూ 10–15 శాతం ఫ్లక్చువేట్ అవుతుందని చెప్పారు.  బిట్‌‌కాయిన్‌‌ ధరలు పెరుగుతున్నా తాను కొననని ఈ ఇన్వెస్టర్‌‌‌‌ అన్నారు. ‘టౌన్‌‌లో జరిగే ప్రతీ పార్టీ(ప్రతీ అసెట్‌‌కు అని అర్ధం)కి వెళ్లాలని అనుకోను. అందుకే బిట్‌‌కాయిన్‌‌ గురించి ఆలోచించడం లేదు’ అని జున్‌‌జున్‌‌వాలా పేర్కొన్నారు. మార్కెట్ ర్యాలీని మిస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయని, నీకు నచ్చిన పార్టీలకు మాత్రమే నువ్వెళ్లాలని తెలిపారు. నా జీవితంలో బిట్‌‌కాయిన్‌‌ ఎప్పుడూ కొననని అన్నారు. కేవలం ప్రభుత్వాలు ఇష్యూ చేసే క్రిప్టో కరెన్సీలను మాత్రమే అనుమతివ్వాలని హై లెవెల్‌‌ కమిటీ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. దీనిపై జున్‌‌జున్‌‌వాలా  మాట్లాడారు. ‘కరెన్సీలను ఇష్యూ చేసే అధికారం కేవలం ప్రభుత్వాల చేతిల్లోనే ఉండాలి. ఈ అధికారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకూడదు. ప్రభుత్వాలకు ఉండే ముఖ్యమైన హక్కు కరెన్సీని ఇష్యూ చేయడమే. ఇండియాలో క్రిప్టోకరెన్సీలను రెగ్యులేటరీ బ్యాన్ చేయాలి’ అని పేర్కొన్నారు.