ఈసారి కప్పు కరువు తీరుస్తాం.. ఐసీసీ ట్రోఫీ అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాం: హర్మన్

ఈసారి కప్పు కరువు తీరుస్తాం.. ఐసీసీ ట్రోఫీ అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాం: హర్మన్

ముంబై: సొంతగడ్డపై జరిగే వన్డే విమెన్స్ వరల్డ్ కప్‌‌లో గెలిచి ఐసీసీ ట్రోఫీ కరువుకు తెరదించాలని తమ జట్టు కృతనిశ్చయంతో ఉందని ఇండియా కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ కౌర్ చెప్పింది.  వరల్డ్ కప్‌‌నకు ముందు టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ తమకు మంచి సన్నాహకంగా ఉపయోగపడుతుందని, తమ జట్టు ఎక్కడ ఉందో క్లారిటీ ఇస్తుందని తెలిపింది.ఇండియా విమెన్స్ టీమ్ ఐసీసీ టోర్నీల్లో రెండు సార్లు ఫైనల్ చేరుకున్నప్పటికీ కప్పు అందుకోలేకపోయింది. 2017 వన్డే  వరల్డ్‌‌ కప్‌‌లో రన్నరప్‌‌గా నిలిచింది. 

‘దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్న ఆ అడ్డంకి (ఫైనల్)బద్దలు కొట్టాలని మేము కోరుకుంటున్నాం. వరల్డ్ కప్స్ ఎల్లప్పుడూ స్పెషల్‌‌. దేశం కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని నేను కోరుకుంటాను. యువరాజ్ సింగ్​ను చూసినప్పుడల్లా నాకు ఎంతో స్ఫూర్తి కలుగుతుంది’ అని సోమవారం జరిగిన వన్డే వరల్డ్ కప్‌‌ ట్రోఫీ టూర్‌‌‌‌ ఆవిష్కరణ కార్యక్రమంలో హర్మన్‌‌ చెప్పింది. ఈ ఈవెంట్‌‌లో మాజీ ఆల్-రౌండర్ యువరాజ్ సింగ్, విమెన్స్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, ఐసీసీ చైర్మన్‌‌ జై షా,   సీఈఓ సంజోగ్‌‌ గుప్తా, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా కూడా పాల్గొన్నారు. 

ఇటీవల ఇంగ్లండ్‌‌ టూర్‌‌‌‌లో  వన్డే, టీ20 సిరీస్‌‌లలో ఇండియా మిథాలీసేన సెప్టెంబర్ 14 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సిరీస్‌‌తో తమ బలాబలాలపై స్పష్టమైన అవగాహన వస్తుందని మిథాలీ చెప్పింది. ‘ఆస్ట్రేలియాతో ఆడటం ఎల్లప్పుడూ సవాలుతో కూడుకున్నది. దానివల్ల మన బలం ఏంటో, మనం ఎక్కడ ఉన్నామో స్పష్టమైన అవగాహన వస్తుంది.  ట్రెయినింగ్ క్యాంప్స్ లో మేం చాలా కష్టపడుతున్నాం. దాని ఫలితాలు కనిపిస్తున్నాయి’ అని పేర్కొంది. 

2017 సెమీ-ఫైనల్‌‌లో ఆస్ట్రేలియాపై తాను చేసిన 171 రన్స్‌‌ ఇన్నింగ్స్‌‌ను హర్మన్‌‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. ‘ఆ ఇన్నింగ్స్ నాకే కాదు మొత్తం విమెన్స్ క్రికెట్‌‌కు చాలా ప్రత్యేకం. ఆ ఇన్నింగ్స్ తర్వాత నా లైఫ్‌‌లో చాలా విషయాలు మారిపోయాయి. మేము ఓడిపోయి ఇండియాకు తిరిగొచ్చినప్పుడు చాలా మంది ప్రజలు మా కోసం ఎదురుచూసి, మమ్మల్ని ఉత్సాహపరిచారు. అది తలచుకుంటే ఇప్పటికీ నాకు గూస్‌‌ బంప్స్ వస్తాయి’ అని తెలిపింది.

2017 వరల్డ్ కప్‌‌ విమెన్స్ క్రికెట్‌‌ను మార్చేసింది: మిథాలీ

2017 వరల్డ్ కప్‌‌ విమెన్స్‌‌ క్రికెట్‌‌కు ఒక టర్నింగ్ పాయింట్ అని మిథాలీ రాజ్ చెప్పింది. ‘2017 వరల్డ్ కప్ కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విమెన్స్ క్రికెట్‌‌ను మార్చివేసింది. అప్పట్లో సోషల్ మీడియా కొత్తగా ఉండటం, ఐసీసీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం దీనికి కారణం’ అని అభిప్రాయపడింది. కాగా, విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌‌ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు ఇండియాలోని నాలుగు నగరాల్లో జరగనుంది. పాకిస్తాన్‌‌ తమ మ్యాచ్‌‌లను కొలంబోలో ఆడనుంది. 

అంచనాల గురించి ఆలోచించొద్దు: యువీ

అంచనాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆడితే ఫలితాలు వాటంతట అవే వస్తాయని మెన్స్ వన్డే, టీ20 వరల్డ్ కప్స్ విన్నర్ యువరాజ్ సింగ్ అమ్మాయిలకు సూచించాడు. ‘అంచనాల గురించి కాకుండా, పరిస్థితికి తగ్గట్టుగా ఆడండి. ఆ క్షణంలో జీవించండి. చరిత్ర సృష్టించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. 

కానీ దాని అర్థం మీరు ఆరంభం నుంచే వరల్డ్ కప్‌‌ విజయం గురించి ఆలోచించాలని కాదు. మీరు ఆ ప్రక్రియను ఆస్వాదించండి.  ఫలితాలు వాటంతట అవే వస్తాయి. వరల్డ్ కప్ గెలవాలంటే మీరు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అనుకున్నవి జరగవు. అప్పుడే మీ అనుభవం, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని నడిపించాలి’ అని యువీ పేర్కొన్నాడు.