- వార్ ఆపేందుకు ఇండియా కృషి: రష్యా అధ్యక్షుడు పుతిన్
- అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నా.. భారత్‌కు ఇంధన సరఫరా కొనసాగుతదని ప్రకటన
- ఢిల్లీలో మోదీ, పుతిన్శిఖరాగ్ర సమావేశం
- రక్షణ, వైద్య, ఎనర్జీ రంగాల్లో కీలక ఒప్పందాలు
- రష్యాతో కలిసి ఉగ్రవాదంపై పోరాడుతామన్న మోదీ
- ఇది యుద్ధాల యుగం కాదు.. శాంతి శకం అని వెల్లడి
- మోదీ.. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదన్న పుతిన్
- ముగిసిన రష్యా అధ్యక్షుడి రెండురోజుల భారత్ పర్యటన
న్యూఢిల్లీ: రష్యా – ఉక్రెయిన్ వార్ విషయంలో భారత్ న్యూట్రల్‌గా లేదని.. శాంతి పక్షాన ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి తాము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని వెల్లడించారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకుని యుద్ధానికి ముగింపు పలకాలని ఆయన సూచించారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపనకు ఇండియా తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉంటుందని.. ఇది యుద్ధాల యుగం కాదని, శాంతి శకం అని పేర్కొన్నారు. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌తో శాంతి ప్రయత్నాల్లో ఇండియా ఆసక్తి చూపడం సంతోషంగా ఉందన్నారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకునేందుకే ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
నమ్మకం ఆధారంగా ఇండియా, -రష్యా మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరు దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎప్పటి నుంచో కలిసి పోరాడుతున్నాయని పుతిన్ పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం ప్రధాని మోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు. ఇరుదేశాల 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జాయింట్ ప్రెస్మీట్లో మాట్లాడారు.
నా ఫ్రెండ్ పుతిన్‌కు థాంక్స్: మోదీ
మానవత్వం శాంతిని కోరుకుంటున్నదని.. చర్చలు, దౌత్యం ద్వారానే ఉక్రెయిన్, రష్యా వార్ సంక్షోభానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘శాంతిని సాధించే దిశగా జరిగే ప్రతి ప్రయత్నానికి ఇండియా పూర్తి మద్దతు ఇస్తుంది. ఆ ప్రయత్నాల్లో మేం భాగం కావడానికి సిద్ధంగా ఉన్నాం. ఉక్రెయిన్ వివాదంపై పుతిన్ మాతో ప్రతి విషయాన్ని విశ్వసనీయంగా పంచుకోవడం భారత్, రష్యా దేశాల మధ్య ఉన్న లోతైన నమ్మకాన్ని సూచిస్తున్నది. ఇది యుద్ధాల యుగం కాదు.. శాంతి శకం’’ అని ఆయన పేర్కొన్నారు. 80 ఏండ్లలో ప్రపంచం ఎన్నో మార్పులు, సవాళ్లు ఎదుర్కొన్నదని మోదీ అన్నారు.
‘‘ఇండియా, రష్యా స్నేహం ఈ మార్పులకు అతీతంగా ఉంది. ఇది మ్యూచువల్ రెస్పెక్ట్, డీప్ ట్రస్ట్‌పై ఆధారపడి ఉంది. పుతిన్ గత 25 ఏండ్లు ఈ సంబంధాన్ని నా నాయకత్వంతో మరింత బలపరిచారు. నా స్నేహితుడు పుతిన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశాల సంక్షేమం శాంతి మార్గంలోనే ఉంది. నేను, పుతిన్ కలిసి ప్రపంచాన్ని ఆ మార్గంలో నడిపిస్తాం. ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రయత్నాలతో ఈ ప్రపంచం మరోసారి శాంతి దిశగా తిరిగి వస్తుందని ఆశిస్తున్నాను. మా చిరకాల స్నేహం.. పుతిన్ వ్యూహాత్మక విజన్‌ను ప్రతిబింబిస్తున్నది. ఉగ్రవాదంపై పోరుకు ఇండియా, రష్యా కలిసి నడుస్తాయి.
ఇటీవల పహల్గాంలో జరిగిన దాడికి, గతేడాది రష్యా రాజధాని మాస్కో లోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లో జరిగిన దాడికి మూల కారణం టెర్రరిజమే. మానవత్వ విలువలపై చేస్తున్న ఈ ప్రత్యక్ష దాడులకు వ్యతిరేకంగా ఉగ్రవాదంపై పోరుకు రెండు దేశాలు ఏకం అయ్యాయి. భారత్, రష్యా, యూఎన్, జీ20, బ్రిక్స్ వేదికలు సన్నిహిత సహకారాన్ని కలిగి ఉన్నాయి. ఈ వేదికలన్నింటిలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని కొనసాగిస్తాం’’ అని మోదీ స్పష్టం చేశారు.
2030 నాటికి వాణిజ్యం8.30 లక్షల కోట్లకు..
రష్యా, ఇండియా మధ్య ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రూ.8.30 లక్షల కోట్లకు (100 బిలియన్ డాలర్లకు) పెంచేందుకు కృషి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘క్రిటికల్ మినరల్స్ అంశంలో సహకారం, సురక్షితమైన సప్లై చైన్‌పై దృష్టిపెడ్తున్నాం. రష్యన్ సిటిజన్స్‌కు త్వరలో 30 రోజుల ఉచిత ఈ – టూరిస్ట్ వీసా, గ్రూప్ టూరిస్ట్ వీసా సదుపాయాన్ని ప్రారంభిస్తాం. పోలార్ వాటర్స్‌లో ఇండియన్ నావికులకు శిక్షణ ఇవ్వడంపై రెండు దేశాలు కలిసి పనిచేయడం, ఆర్కిటిక్ ప్రాంతంలో సహకారాన్ని బలోపేతం చేస్తుంది’’ అని మోదీ తెలిపారు. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్, చెన్నై–వ్లాదివోస్తోక్ సముద్ర మార్గం వంటి కనెక్టివిటీ మార్గాల పూర్తి సామర్థ్యాన్ని సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఇండియా, రష్యా మధ్య కీలక ఒప్పందాలు
ఇండియా, రష్యా మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. వలస విధానం, రక్షణ, ఆహార భద్రత, వైద్య, ఆరోగ్య, కెమికల్ ఫెర్టిలైజర్స్, సముద్ర ఆహార ఉత్పత్తులు వంటి అంశాలపై ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాలు 15కి పైగా ఒప్పందాలు, ఎంవోయూలపై సంతకాలు చేసుకున్నాయి. హైదరాబాద్ హౌస్‌లో మోదీ, పుతిన్ చర్చల తర్వాత అధికారులు సంతకాలు చేశారు.
యూరేషియన్ ఎకనామిక్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై త్వరగా ఒక ముగింపునకు రావడానికి కృషి చేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. రూపాయి, రూబుల్ వంటి జాతీయ కరెన్సీలలో వాణిజ్య లావాదేవీల వాటాను మరింత పెంచడానికి ఇరువురు నేతలు అంగీకరించారు. లాజిస్టిక్ మద్దతు ఒప్పందాన్ని రష్యా పార్లమెంట్ ఆమోదించింది. దీని ద్వారా ఇరు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాలు మరొక దేశ పోర్టులు లేదా స్థావరాల్లో లాజిస్టిక్ మద్దతు, ఇంధనం, మరమ్మతులు పొందొచ్చు.
ఎస్–-400 క్షిపణి రక్షణ వ్యవస్థలో మిగిలిన స్క్వాడ్రన్‌ల డెలివరీని వేగవంతం చేయాలన్న విజ్ఞప్తికి పుతిన్ సానుకూలంగా స్పందించారు.
టెంపరరీ లేబర్ యాక్టివిటీ అండ్ కాంబటింగ్ ఇరెగ్యులర్ మైగ్రేషన్ కింద 2 ఒప్పందాలు .. దీంతో ఈ టూరిస్ట్ వీసా (30 రోజులు ఫ్రీ), గ్రూప్ టూరిస్ట్ వీసా (30 రోజులు), ఇండియన్ స్కిల్డ్ వర్కర్లకు రష్యాలో అవకాశాలు లభిస్తాయి. ముంబై వర్సిటీ, లోమోనోసావ్ మాస్కో స్టేట్ వర్సిటీ, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ మధ్య ఎంవోయూ జరిగింది.
ఫైనాన్షియల్ కో ఆపరేషన్ ప్రోగ్రామ్ కింద.. ద్వైపాక్షిక వాణిజ్యం రూ.8.30 లక్షల కోట్లకు చేరుకోవడానికి, వాణిజ్య లోటును తగ్గించడానికి మోదీ, పుతిన్ ఒప్పందం చేసుకున్నారు.అధునాతన సుఖోయ్ 57 స్టెల్త్ ఫైటర్ జెట్లు, ఎస్ 500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి వ్యవస్థల కొనుగోలుపై చర్చించి ఎంవోయూ చేసుకున్నారు.
అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నా.. ఇంధన సరఫరా ఆపబోం: పుతిన్
అమెరికా లాంటి దేశాల నుంచి వాణిజ్య ఒత్తిడులు ఎదురవుతున్నప్పటికీ.. ఇండియా, రష్యా మధ్య ఇంధన సరఫరా కొనసాగుతుందని పుతిన్ స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా చమురు దిగుమతుల ను ఇండియా తగ్గించినప్పటికీ.. ఆ దేశాభివృద్ధికి సహకరించడానికి సరఫరా పెంచే చర్యలు చేపడతామన్నారు. ‘‘గతేడాది భారత్- రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 12% పెరిగి.. రికార్డు సృష్టించింది. ఈ ఏడాది కూడా ఇదే స్థాయిలో పెరుగుదల ఉంటుందని ఆశిస్తున్న. ఇండియా, రష్యా భాగస్వామ్యం ఏ పశ్చిమ దేశ వ్యతిరేక కూటమిలో భాగం కాదు’’ అని పుతిన్ తెలిపారు.
రక్షణ పరికరాలు, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌పై పుతిన్‌తో చర్చించా.
ఇరు దేశాల భాగస్వామ్యంలో ఎనర్జీ సెక్యూరిటీ ముఖ్యం. సివిల్ న్యూక్లియర్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో దశాబ్దాల నాటి సహకారాన్ని కొనసాగిస్తం. క్రిటికల్ మినరల్స్ అంశంపై ఫోకస్ పెడ్తున్నం. రష్యా పౌరులకు త్వరలో 30 రోజుల ఉచిత ఈ - టూరిస్ట్ వీసా, గ్రూప్ టూరిస్ట్ వీసా సదుపాయాన్ని ప్రారంభిస్తాం. పోలార్ వాటర్స్‌లో ఇండియా నావికులకు శిక్షణ ఇవ్వడంపై రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాం.
- ప్రధాని నరేంద్ర మోదీ
రక్షణ రంగంలో ఇండియాతో మా సహకారం చిరకాలంగా ఉంది. క్షిపణులు, రక్షణ సాంకేతికతల విషయంలో ఇండియాకు మా
మద్దతు ఉంటది. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ కో ఆపరేషన్, అలాగే చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్లు, ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో భాగస్వామ్యం కోసం ఆసక్తిగా ఉన్నం. టెర్రరిజం ముప్పును ఎదుర్కోవడంలో ఇండియాకు మేం పూర్తి మద్దతు ఇస్తున్నాం. మోదీది విశ్వసనీయ వ్యక్తిత్వం. ఏ ఒత్తిడికి తలొగ్గకుండా తన దేశ ప్రయోజనాలను కాపాడుతారు. మా మధ్య ఉన్న సంబంధం వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా చాలా లోతుగా ఉంది.
- రష్యా అధ్యక్షుడు పుతిన్
