మేం కోవర్టులం కాదు ..ఏ లక్ష్యం కోసం ప్రాణాలు ఇమ్మంటున్నారు: మాజీ మావోయిస్టు ఆశన్న

మేం కోవర్టులం కాదు ..ఏ లక్ష్యం కోసం ప్రాణాలు ఇమ్మంటున్నారు: మాజీ మావోయిస్టు ఆశన్న
  • మా శవాలొస్తే ఎర్రజెండాలు కప్పి ఊరేగిస్తే చాలా? 
  • పౌర, మానవ హక్కుల సంఘాలు పరిధి దాటి మాట్లాడొద్దని వ్యాఖ్య
  • లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి వీడియో రిలీజ్

హైదరాబాద్, వెలుగు: తాము కోవర్టులం కాదని మావోయిస్టు పార్టీ మాజీ సెంట్రల్ కమిటీ మెంబర్ తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్​ఆశన్న  అన్నారు. సాయుధ పోరాటాన్ని విరమించాలన్న నిర్ణయం మావోయిస్టు పార్టీ సెంట్రల్​కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్​బస్వరాజ్(బీఆర్) దాదా ఉన్నప్పుడే తీసుకున్నామని పేర్కొన్నారు. 

ఈ విషయమై ఆయనకు పలుమార్లు లేఖలు రాశామని.. తీరా లొంగిపోయాక తమను కోవర్టులు, విప్లవ ద్రోహులు అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ‘‘ద్రోహులు అన్న పదం మేం ఊహించిందే. కానీ, కోవర్టులు అని ముద్ర వేయకండి. ఏ లక్ష్యం కోసం ప్రాణాలు ఇమ్మంటున్నరు. మా శవాలొస్తే ఎర్రజెండాలు కప్పి ఊరేగిస్తే చాలా? పౌర, మానవ హక్కుల సంఘాల వాళ్లు పరిధి దాటి మాట్లాడొద్దు’’ అని ఆయన అన్నారు. 

లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి ఇటీవల జరిగిన పరిణామాలపై 32 నిమిషాల వీడియోను ఆశన్న శనివారం రిలీజ్ చేశారు. తనతో పాటు సోనుపై వేసిన కోవర్టు అనే ముద్రను వెనక్కి తీసుకోవాలని మావోయిస్టు పార్టీ ఉద్యమంలో ఉన్న కామ్రెడ్స్​కు విజ్ఞప్తి చేశారు.  

ప్రాణాలతో రక్షించుకోవాలనే..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్​ కగార్​ పేరుతో ఎన్​కౌంటర్లు జరుపుతూ.. తీవ్ర నిర్బంధం విధిస్తుంటే మావోయిస్టులను ప్రాణాలతో రక్షించుకోవాలనే ఉద్దేశంతో సాయుధ పోరాటాన్ని విరమించాలని ముగ్గురు, నలుగురు సెంట్రల్​ కమిటీ సభ్యులం బీఆర్​దాదా దృష్టికి తీసుకెళ్లినం. ఆయన బతికున్న సమయంలో ఏప్రిల్, మే నెలలోనే దీనిపై నేను, సోను పలుమార్లు పార్టీతో చర్చలు జరిపినం. ఈ విషయాలన్నీ దేవ్​జీకి కూడా తెలుసు. 

జూన్​ నెలలో పోలీసులు పెద్దఎత్తున ఆపరేషన్లు చేపట్టనున్నారనే విషయం మా దృష్టికి  రావడంతో దాదాకు పలుమార్లు లేఖలు రాసినం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతకంటే మంచి నిర్ణయం మరొకటి ఉండదని.. అయినా, దీనిపై సెంట్రల్​ కోర్​ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని బీఆర్​ దాదా మాతో చెప్పారు. 

నెల రోజుల పాటు కాల్పులు జరపకుండా అవకాశం ఇస్తే తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బయట ప్రపంచానికి తెలిసేలా పార్టీ లేఖలు రిలీజ్​ చేసింది. అంటే దీని అర్థం ఏమిటి? దండకారణ్యంలో దక్షిణం వైపు ఉన్న పార్టీ సభ్యులకు ఇది తెలియదు. మాకు, వాళ్లకు మధ్య కొంత గ్యాప్​ ఉంది. పోలీసుల నిర్బంధంతో సెంట్రల్​ కమిటీ సభ్యులంతా కలిసి ఒకే చోట కోర్​ కమిటీ మీటింగ్​జరుపుకునే అవకాశం మాకు లేకుండా పోయింది. 

ఉత్తరం, పశ్చిమ జోన్​లో పనిచేసే వాళ్లంతా కింది నుంచి పై దాకా చర్చించాక సాయుధ పోరాటం విరమించాలనే నిర్ణయం తీసుకున్నాం. నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. అయినా, ఒకసారి దాదా నేతృత్వంలో జరిగిన డీకే ఎస్​జడ్​సీ సమావేశంలో నాతో పాటు సోను పాల్గొన్నారు. ఇప్పుడు మమ్మల్ని వ్యతిరేకిస్తున్న వాళ్లు కూడా అక్కడ ఉన్నారు. 

రండి చర్చ జరుపుదాం అని పిలిస్తే దాదా ముందుకు వాళ్లు రాలేదు. ఇప్పుడేమో తమకేమీ తెలియదని.. పార్టీకి తెలవకుండా ఆయుధాలు అప్పగిస్తూ లొంగిపోయారంటూ మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దాదా ఎన్​కౌంటర్​లో చనిపోయిన తర్వాత తోటి మావోయిస్టులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో 210 మందిమి కలిసి ప్రభుత్వానికి లొంగిపోయినం. ఇక్కడ లొంగిపోయిన వాళ్లంతా ఆషామాషీ వ్యక్తులు కాదు. ఏది మంచి.. ఏదీ చెడు అని నిర్ణయించుకునే శక్తి ఇక్కడ ఉన్నవాళ్లందరికీ ఉంది’’ అని ఆశన్న వీడియోలో తెలిపారు.

హైదరాబాద్​లో ఉండి మాట్లాడటం కరెక్ట్ కాదు 

ఎన్నో దశాబ్దాలుగా అడవుల్లో ఉండి ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నామని,. పోలీసుల నిర్బంధంతో తమ లక్ష్యం నెరవేరని పరిస్థితికి వచ్చిందని ఆశన్న పేర్కొన్నారు. ‘‘అలాంటప్పుడు మేం ఎందుకోసం ప్రాణాలు అర్పించాలి. మా శవాలొస్తే ఎర్రజెండాలు కప్పి ఊరేగిస్తే చాలా? మీకందరికి సంతోషమా.. హైదరాబాద్​లో ఉండి మాట్లాడటం కరెక్ట్​ కాదు. అడవిలోకి వచ్చి చూస్తే తెలుస్తది మా పరిస్థితి ఏంటో’’ అని ఆశన్న వ్యాఖ్యానించారు. 

సోను, ఆశన్న ఎన్​కౌంటర్​లో చనిపోకుండా ఇన్నేండ్లు ఎట్లా బతికి ఉన్నారు? అని కొందరు తాము చేసిన పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నరు. ఇట్లా మట్లాడటం కరెక్ట్​ కాదు. మా పోరాటం గురించి తెలుసుకోవాలంటే దండకారణ్యంలో మేం పనిచేసిన చోట ప్రజలను అడగాలి. మాకు రక్షణగా ఉన్న కామ్రెడ్స్​తో మాట్లాడాలి. 

పౌర, మానవ హక్కుల సంఘాల వాళ్లు మైకు దొరికితే ఏది పడితే అది మాట్లాడుతున్నరు. స్టేజీ ఎక్కగానే వాళ్లకు అవసరంలేని విషయాలను చెబుతున్నారు. హైదరాబాద్​ బుద్ధిజీవులు, మీకు మా పట్ల గానీ, మా ఉద్యమం పట్ల గానీ మీకు తెలుసుకోవాలనుకుంటే మా దగ్గరికి రండి. మేం అన్నీ వివరిస్తం. మీకు అన్ని సాక్ష్యాధారాలు చూపిస్తం. అంతేగానీ మమ్మల్ని కించపరిచేలా మాట్లాడవద్దు’’ అని ఆశన్న కోరారు. 

పార్టీ పిలిస్తే ఎక్కడికైనా వస్తా

తాము సాయుధ పోరాటం విరమించిన విషయాన్ని దేశంలో 99 శాతం మంది ప్రజలు స్వాగతిస్తున్నారని ఆశన్న తెలిపారు. ‘‘మేం గాలికి మాట్లాడట్లేదు. ఇప్పటికైనా మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటం విరమణ విషయంపై లోతుగా చర్చించాలి.

 లీడర్లు తమ క్యాడర్​ నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి. ఎందుకోసం పోరాటం చేస్తున్నామో క్యాడర్​కు చెప్పగలగాలి. నన్ను పార్టీ పిలిస్తే ఎక్కడికైనా వస్తా. నేనేవరికి భయపడను. మేం లొంగిపోవడానికి గల కారణాలు, దీనికంటే ముందు పార్టీకి రాసిన లేఖలు, బీఆర్​ దాదాతో జరిగిన ఉత్తర, ప్రత్యుత్తరాలు చూపిస్తాను. అంతేగానీ మమ్మల్ని కోవర్టులు అని ముద్ర వేయకండి. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి’’ అని మావోయిస్టు పార్టీకి ఆశన్న విజ్ఞప్తి చేశారు.