మాకొద్దు కరోనా వ్యాక్సిన్.. అమెరికన్లలో 25శాతం మంది భయపడ్తున్నరు

మాకొద్దు కరోనా వ్యాక్సిన్.. అమెరికన్లలో 25శాతం మంది భయపడ్తున్నరు

నర్సింగ్ హోంల సిబ్బందిలోనే ఎక్కువ మంది నో  చెబుతున్నరు

ఓల్డేజ్ హోంలో ఉన్న వృద్ధులు వద్దంటున్నరు

తెల్లజాతివాళ్లలో 53%.. నల్లవాళ్లలో 25% మందే రెడీ

అసోసియేటెడ్ ప్రెస్ సర్వేలో వెల్లడి 

వాషింగ్టన్: అమెరికాలో ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి ఆమోదం లభించడంతో ఆ వ్యాక్సిన్​ను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు.  కంపెనీ నుంచి తొలి విడతలో 1.84 లక్షల డోసులు ఆదివారమే ఆయా ప్రాంతాలకు బయలుదేరగా.. సోమవారం నుంచి ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లు, నర్సింగ్ హోంల సిబ్బంది, వృద్ధులకు వ్యాక్సినేషన్ షురూ అయింది. అయితే అటు నర్సింగ్ హోంలతో పాటు ఇటు ప్రజల్లోనూ ఫైజర్ వ్యాక్సిన్​పై భయాందోళనలు నెలకొన్నాయి. ఏండ్ల తరబడి డెవలప్ మెంట్ ప్రక్రియ కొనసాగాల్సి ఉండగా, ఈ వ్యాక్సిన్​ను హడావుడిగా కొన్ని నెలల్లోనే తీసుకురావడంతో నర్సింగ్ హోం సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా నర్సింగ్ హోంల సిబ్బందిలోనే ఎక్కువ మంది ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు సిద్ధంగా లేరని లోకల్ మీడియా చెప్తోంది.

వ్యాక్సిన్ వేసుకోమన్న 25% మంది 

అమెరికాలో దాదాపు 25% మంది జనం కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారట. మరో 25% మంది చెప్పలేమని అంటున్నారట. అసోసియేటెడ్ ప్రెస్, ఎన్ వోఆర్ సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో ఈ సంగతులు వెల్లడయ్యాయి. వ్యాక్సిన్ పై ఫ్రంట్ లైన్ వర్కర్ల సిబ్బంది, జనంలో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తేలింది. సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం.. తెల్ల జాతీయుల కంటే నల్ల జాతి ప్రజలే ఎక్కువగా భయపడుతున్నారని తేలింది. దాదాపు 53% మంది తెల్ల జాతి ప్రజలు తాము వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధమని చెప్పగా, నల్ల జాతీయుల్లో 24% మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకుంటామని చెప్పారు. స్పానిష్​ అమెరికన్లలో 34 % మందే వ్యాక్సిన్ కు రెడీ అన్నారు. ఇక మగవారితో పోలిస్తే ఆడవాళ్లలోనూ ఎక్కువ మంది వ్యాక్సిన్ కు భయపడ్తున్నారని తేలింది.