ఆ టీచర్ మాకొద్దు.. వేధిస్తున్నాడంటూ విద్యార్థినుల ఆందోళన

ఆ టీచర్ మాకొద్దు.. వేధిస్తున్నాడంటూ విద్యార్థినుల ఆందోళన

నేరడిగొండ, వెలుగు :  టీచర్​ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని,  ఆ టీచర్  తమకు అవసరం లేదని ఆదిలాబాద్  జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థినులు శనివారం ఆందోళన చేశారు. పదో తరగతి పరీక్షలు తన చేతిలోనే ఉంటాయని ఫిజికల్  సైన్స్  టీచర్  జగదీశ్వర్  రెడ్డి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. టాప్ లు వేసుకొని బస్సుల్లో, సంతల్లో తనను అడుక్కోవాలంటున్నాడని, అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు బోరున ఏడ్చారు.

ఆ టీచర్ ను వెంటనే తొలగించాలని,  లేదంటే తాము ఆ స్కూల్ లో చదువుకోమని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్సై మారుతి.. స్కూల్ కి చేరుకొని బాలికలను సముదాయించారు. సంబంధిత టీచర్ పై హెడ్ మాస్టర్  పద్మ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆందోళన విరమించారు. మధ్యాహ్న భోజనం సైతం సరిగ్గా పెట్టడం లేదని స్టూడెంట్లు ఆరోపించారు. ఈ విషయంపై హెడ్ మాస్టర్ ను వివరణ కోరగా ఇది తమ దృష్టికి రాలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.