చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసే వరకు పోరాడుతాం: రామగళ్ల పరమేశ్వర్​

చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసే వరకు పోరాడుతాం: రామగళ్ల పరమేశ్వర్​

చేర్యాల, వెలుగు : అన్ని అర్హతలున్న చేర్యాలను రెవెన్యూ డివిజన్​ కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటాలు ఆగవని జేఏసీ చైర్మన్​డాక్టర్​ రామగళ్ల పరమేశ్వర్​ స్పష్టం చేశారు. శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రం నుంచి సిద్దిపేట కలెక్టరేట్​ వరకు భారీ బైక్​ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డికి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ మాట్లాడుతూ ఘనమైన చరిత్ర కలిగిన చేర్యాలను పాలకులు కుట్రలతో కుదింపు చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ సమితీగా, నియోజకవర్గ కేంద్రంగా, తాలూకా కేంద్రంగా  ఉండి తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చిన చేర్యాల నేడు మసకబారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఐదేండ్లుగా చేర్యాలను రెవెన్యూ డివిజన్​ చేయాలని డిమాండ్​ చేస్తూ అఖిలపక్ష పార్టీల ఆందోళనలు చేస్తున్నా బీఆర్​ఎస్​ ప్రభుత్వం పెడచెవిన పెట్టడం సరికాదన్నారు. 

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెవెన్యూ డివిజన్​ చేస్తామని చెప్పి, తర్వాత మాట మార్చారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు రెవెన్యూ డివిజన్​ విషయంలో నోరు మోదపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్​రావు స్పందించి చేర్యాలను రెవెన్యూ డివిజన్​గా ప్రకటించాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు.  కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు ఆది శ్రీనివాస్, పి.ఆగంరెడ్డి, ఎ. మల్లారెడ్డి, అందె అశోక్​, వి. నర్సయ్య పంతులు, కౌన్సిలర్​ చెవిటి లింగం, ఎం.చిరంజీవులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.