న్యూఢిల్లీ:ఇటీవలి కాలంలో ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొనే సత్తా టీమిండియాలో బాగా పెరిగిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. త్రోడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర (రఘు)వల్లే ఇది సాధ్యమైందన్నాడు. అతను సైడ్‌ఆర్మ్ (క్రికెట్ ఎక్విప్‌మెంట్) తో 150, 150 కేఎంపీహెచ్ వేగంతో విసిరే బాల్స్‌ను సులువుగా ఎదుర్కొంటున్నామన్నాడు. ‘2013 నుంచి మా బ్యాట్స్‌మెన్ ఫాస్ట్ బౌలింగ్‌ను చాలా బాగా ఎదుర్కొంటున్నారు. చాలా పురోగతి కనిపిస్తున్నది. దీనికి కారణం రఘు అని తెలుసు. ఫుట్‌వర్క్, ప్లేయర్ల బ్యాట్ మూమెంట్‌కు సంబంధించి అతని వద్ద మంచి కాన్సెప్ట్‌లు ఉన్నాయి. ఈ సైడ్‌ఆర్మ్ కాన్సెప్ట్‌తో బాల్ 155 కేఎంపీహెచ్ స్పీడ్‌తో వస్తుంది. నెట్స్‌లో రఘును ఎదుర్కొన్న తర్వాత మ్యాచ్ ఆడటానికి వెళ్తే బాల్ రావడానికి చాలా సమయం ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే చాలా ఏళ్లుగా రఘు.. మా సపోర్ట్ స్టాఫ్‌లో కీలక వ్యక్తి అనొచ్చు’ అని బంగ్లా స్టార్ బ్యాట్స్‌మన్ తమీమ్‌తో జరిగిన ఇన్‌స్టా లైవ్‌లో కోహ్లీ పేర్కొన్నాడు. అధిక ఒత్తిడి ఉండే బిగ్ ఛేజింగ్ మ్యాచ్‌ల్లో ఏనాడూ తనపై సెల్ఫ్ డౌట్స్ రాలేదన్నాడు. ‘నిజాయితీగా చెబుతున్నా.. మ్యాచ్ ఎలాంటి పరిస్థితు ల్లో ఉన్నా నా సత్తాపై అనుమానాలు రాలేదు. ప్రతి మనిషికి బలహీనతలు, డౌట్స్ ఉండటం సాధారణం. చెత్త ఆలోచనలు మైండ్‌లోకి వస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది. అందుకే ఎప్పుడూ కాంపిటీషన్ మోడ్‌లో ఉండాలి. నేను బాగా ఆడతా అనే ఆలోచన వస్తే ఎంత పెద్ద టార్గెట్ అయినా ఈజీగా ఛేజ్ చేయొచ్చు’ అని చెప్పాడు.
టీమ్‌ను గెలిపిస్తానా?
చిన్నతనంలో ఇండియా మ్యాచ్‌లు చూసినప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని కోహ్లీ చెప్పాడు. తాను టీమ్ విజయానికి ఎలా సాయపడగలను అనుకుంటూ నిద్రపోయేవాడినన్నాడు. ‘380 టార్గెట్ ఛేజ్ చేసినా నాకు పెద్దగా ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే చిన్నప్పటినుంచి ప్రతి మ్యాచ్ గెలవాలనే కోరుకునేవాడిని. 2011 లో హోబర్ట్‌లో 40 ఓవర్లలోనే 340 ఛేజ్ చేశాం. మన బ్యాటింగ్ అప్రోచ్ 20 ఓవర్ల మ్యాచ్‌లాగా ఉండాలని బ్రేక్‌లో రైనాకు చెప్పా. 40 ఓవర్లంటే లాంగ్ డ్యూరేషన్. తొలి 20 ఓవర్లలో ఎన్ని రన్స్ చేస్తామో చూసి తర్వాతి 20 ఓవర్లను ఆడదామని చెప్పా’ అని విరాట్ వ్యాఖ్యానించాడు.
