సైబర్‌ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి..డీజీపీ శివధర్‌రెడ్డి

సైబర్‌ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి..డీజీపీ శివధర్‌రెడ్డి

నిజామాబాద్, వెలుగు : పెరుగుతోన్న టెక్నాలజీతో పాటు సైబర్‌ ఫ్రాడ్స్‌ సైతం అధిమవుతున్నాయని, ఇలాంటి నేరాల బారిన పడకుండా ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డీజీపీ శివధర్‌రెడ్డి సూచించారు. సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త విధానాలతో మోసాలకు పాల్పడుతున్నారన్నారు. నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సైబర్‌ నేరాలపై అవగాహన లేకపోవడం వల్లే చాలా మంది వీటి బారిన పడుతున్నారన్నారు. సైబర్‌ నేరాలను అరికట్టే విషయంలో సెక్యూరిటీ కౌన్సిల్‌ భాగస్వామ్యం సైతం తీసుకుంటామన్నారు. 

విద్యాసంస్థల ప్రతినిధులు, డాక్టర్లు, లాయర్లు, మేధావులతో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ కౌన్సిల్‌ హైదరాబాద్, సైబరాబాద్‌లో మంచి రిజల్ట్‌ చూపుతోందని, నిజామాబాద్‌ జిల్లాలో సైతం ఇవే ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి పౌరుడు తప్పనిసరిగా హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీపీ సాయి చైతన్య, సెక్యూరిటీ కౌన్సిల్‌ జనరల్‌ సెక్రటరీ కవితారెడ్డి, రజినీకాంత్, దుష్యంత్‌ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్​ అలీ, ఎమ్మెల్యేలు డాక్టర్​ భూపతిరెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి నిజామాబాద్‌ రూరల్, మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌ బిల్డింగ్‌లను ప్రారంభించారు.