రష్యా దాడుల నుంచి రక్షణ కల్పించండి

రష్యా దాడుల నుంచి రక్షణ కల్పించండి

కీవ్: తమ భద్రతకు గ్యారంటీ కల్పించాలని శక్తి సంపత్తులున్న దేశాలను ఉక్రెయిన్​ కోరింది. భవిష్యత్తులో తమపై రష్యా దాడులు చేయకుండా రక్షణ కల్పించాలని డిమాండ్​ చేసింది. ఆస్ట్రియా, స్వీడన్ మాదిరిగా కీవ్​కు న్యూట్రల్​ స్టేటస్​ కల్పించాలంటూ రష్యా చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్​ తోసిపుచ్చింది. ‘‘ఉక్రెయిన్​ ఇప్పుడు రష్యాతో నేరు గా యుద్ధంలో ఉంది. ఇప్పుడు మాకు చట్టబద్ధంగా నిలబడే సెక్యూరిటీ గ్యారంటీలు కల్పించాలె”అని ఉక్రెయిన్​ నెగోషియేటర్​ మిఖైలో పొడోల్యాక్ వెల్లడించారు. ఇందుకుగానూ ఉక్రెయిన్​పై దాడులు మొదలైనప్పటి నుంచి పక్కకు తప్పుకోని దేశాలు చట్టబద్ధమైన సెక్యూరిటీ అగ్రిమెంట్​పై సంతకం చేయాలని సూచించారు. ఉక్రెయిన్​ నాటో సభ్యదేశం కాలేదనే వాస్తవాన్ని అంగీకరించాల్సిందేనని ప్రెసిడెంట్ జెలెన్​స్కీ మంగళవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. రష్యాతో శాంతి ఒప్పందానికి ఆయన ప్రకటన కీలక అడుగుగా భావిస్తున్న క్రమం లో ఈ కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 
తెరపైకి ‘న్యూట్రల్’​ ప్రతిపాదన
ఉక్రెయిన్​లో మూడు వారాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు స్వీడన్, ఆస్ట్రియా మాదిరిగా ఉక్రెయిన్​కు న్యూట్రల్​ హోదా కల్పించాలనే ప్రతిపాదనపై సంప్రదింపులు జరుగుతున్నాయని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్​ చెప్పారు. ఇది ఒక ఆప్షన్​ మాత్రమే అని, దీనిపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, దీనికి ఒప్పుకుంటే రాజీ కుదిరినట్టేనని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల చర్చల్లో న్యూట్రాలిటీ అనేది కీలక అంశంగా ఉందని, మాస్కో, కీవ్​ దీనిపై ఒప్పందం కుదుర్చుకునే విషయంలో చివరి దశలో ఉన్నారని రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్​ వెల్లడించిన తర్వాత పెస్కోవ్​ ఈ కామెంట్లు చేశారు. సంప్రదింపుల ప్రక్రియ అంత సులువుకాదని, కానీ రాజీ కుదురుతుందని నమ్మకం ఉందని లావ్రోవ్​ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్​కు భారీగా అందుతున్న వెపన్స్
యూరప్ దేశాల నుంచి ఉక్రెయిన్​కు భారీగా యాంటీ ట్యాంక్ మిసైల్స్ అందినట్టు మిలిటరీ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. రష్యాతో పోరు లో ఈ మిస్సైల్స్ ​కీలకం.. రష్యా బలగాలను అడ్డుకోవడంలో ఉక్రెయిన్​ సేనలకు ఎంతో సహాయం చేస్తున్నాయి. ఇటీవల ఉక్రెయిన్​కు అందిన యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ వివరాలు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. బ్రిటన్ ఒక్కటే సుమారు 3,615 షార్ట్ రేంజ్ నెక్ట్స్ జెనరేషన్​ లైట్​ యాంటీ ట్యాంక్ వెపన్స్ ను లాంచర్లతో పాటు అందించింది. ఇక జర్మనీ 1,000 యాంటీ ట్యాంక్ వెపన్స్, నార్వే 2,000, స్వీడన్ 5,000 మిసైల్స్ పంపినట్లు వెల్లడించాయి.
అమెరికా మరో రూ. 6 వేల కోట్ల సాయం
ఉక్రెయిన్​కు మరో 80 కోట్ల డాలర్ల (రూ. 6,092 కోట్లు) భద్రతా సాయం అందజేయనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించారు. బుధవారం వైట్ హౌస్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయిన్ కు మిలిటరీ సాయం కోసం.. మా రక్షణ శాఖ నుంచి డైరెక్ట్​గా ఎక్విప్​మెంట్ బదిలీ ద్వారా ఈ సాయం చేస్తాం” అని బైడెన్ వెల్లడించారు.