మాకు రావాల్సిన సీట్లు ఇయ్యాల్సిందే: కూనంనేని

మాకు రావాల్సిన సీట్లు ఇయ్యాల్సిందే: కూనంనేని

ఎల్బీనగర్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు మార్చేది లేదని జరుగుతున్న ప్రచారంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఓ గార్డెన్​లో మంగళవారం జరిగిన రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లిస్తే స్వయంగా పోటీలో ఉం టామని తెలిపారు. ‘మాకు రావాల్సిన సీట్లు ఇయ్యకపోతే మద్దతు నుంచి తప్పుకొని పోటీ చేస్తాం. 119 అసెంబ్లీ సెగ్మెంట్ల‭లో బూత్ స్థాయి కమిటీలు వేస్తున్నాం. ఎలక్షన్ టైం ఫీక్ స్టేజ్​లో టీఆర్ఎస్‭తో పొత్తు కుదరకపోతే మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. మేము టీఆర్ఎస్ వద్దకు వెళ్లడం కాదు.. టీఆర్ఎస్సే మా వద్దకు వస్తుంది. అది వారి అవసరం.’ అని అన్నారు. హుజూరాబాద్ ​ఉప ఎన్నికలో తొలుత టీఆర్ఎస్​కు  మద్దతు ఇచ్చినప్పటికీ తర్వాత ఆర్టీసీ కార్మికుల  ఇబ్బందులను చూసి ఉపసంహరించుకున్నామని తెలిపారు.

ఆర్టీసీని రక్షించాల్సిన బాధ్యత సీఎందే 

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయొద్దని కేసీఆర్ కేంద్రంతో పోరాటం చేస్తున్నారని, ఆర్టీసీని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా సీఎంపైనే ఉందని కూనంనేని పేర్కొన్నారు. పోరాటాలతో ఇప్పటి వరకు 50% సమస్యలు పరిష్కరించుకున్నామని, రెండు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. యూనియన్ యాక్టివిటీని పునరుద్ధరించాలని, పెండింగ్ లో ఉన్న 2017,2021 పే స్కెల్ ను విడుదల చేయాలని అన్నారు. ఆర్టీసీలో ఎన్ని సంఘాల ఉన్నా.. సంస్థ, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతున్న యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమేనని స్పష్టం చేశారు.