బైపోల్ కౌంటింగ్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం : వివేక్ వెంకటస్వామి

బైపోల్ కౌంటింగ్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం : వివేక్ వెంకటస్వామి

సర్వే రిపోర్టులన్నీ టీఆర్ఎస్ పార్టీ  తరపున చేయించినవేనని, అందుకే ఆ పార్టీ అభ్యర్థి మునుగోడు ఉప ఎన్నికలో గెలుస్తారని చెప్పారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా డబ్బులు పంచిందని, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సరిగా క్యాంపెయినింగ్ చేయనివ్వలేదని, తమ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. మునుగోడులో 14మంది మంత్రులు ప్రచారం చేశారన్న వివేక్.. ముగ్గురు మంత్రులు ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ లీడ్ లో ఉందన్నారు. ఫస్ట్ టీఆర్ఎస్ లీడ్ వచ్చినపుడు అదే లీడ్ ఉంటుందని ఆ పార్టీ అభ్యర్థి చెప్పారన్న వివేక్... 2,3,4 రౌండ్లలో బీజేపీ లీడ్ వచ్చిందని ఎలక్షన్ కమిషన్ వాళ్లే రిపోర్ట్ చేశారని చెప్పారు. కానీ, ఫైనల్ ట్యాలీ చేసినపుడు మాత్రం టీఆర్ఎస్సే లీడ్ లోకి వచ్చిందంటే కచ్చితంగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

మునుగోడు బైపోల్ కౌంటింగ్ పై ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని వివేక్ వెంకటస్వామి తెలిపారు. టీఆర్ఎస్ నే గెలిపించాలని కౌంటింగ్ అధికారులపై ఒత్తిడి ఉందన్న ఆయన.. సరైన ఓటింగ్ కౌంటింగ్ జరగాలని డిమాండ్ చేశారు. లేదంటే కౌంటింగ్ నిలిపివేయాలని కోరారు. సర్వే రిపోర్ట్స్ తప్పుగా ఉన్నాయని వాళ్లకు అర్థమైపోయిందని, ప్రతీ రౌండ్ వివరాలు వెబ్ సైట్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఫలితాల వివరాలను వెబ్ సైట్లో ఎందుకు పెట్టడం లేదో అర్థం కావడం లేదన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న వివేక్... తాను కూడా ఎలక్షన్ టైంలో సీఈవో వికాస్ రాజ్ కు ఫోన్ చేసినపుడు ఎలాంటి రియాక్షన్ లేదని తెలిపారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నపుడు నివారించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని, ఎలక్షన్ కమిషన్ లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదని, ఇప్పుడు ఎవరినీ లోపలికి రానివ్వడం లేదని, మీడియాకు పర్మిషన్ ఇవ్వడం లేదని వివేక్ చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ భయంతో మంత్రులకు బాధ్యతలు అప్పగించి.. బీర్లు, బిర్యానీలు, డబ్బులు ఇచ్చి ప్రచారం చేయించిందని ఆరోపించారు. తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక వన్ సైడెడ్ గా జరిగిందని, ఎన్నికల అధికారులు.. ప్రత్యేకంగా పోలీసులు టీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేస్తున్నరని ఆరోపించారు.