
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పంపిన లెటర్‌పై మంగళవారం సమీక్షించి విశ్లేషణ జరుపుతామని, దానికి తగ్గట్టుగానే తదుపరి చర్యలు ఉంటాయని పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ‘‘కేసీఆర్ పంపిన లేఖ మాకు అందింది. లెటర్లో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. చత్తీస్‌గఢ్ పవర్ పర్చేస్.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లకు సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించాల్సి ఉంది. ఎవరికైనా తమ అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ నిస్సందేహంగా ఉంటుంది. కేసీఆర్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తాం. ఎవరి అభ్యంతరాలు వారికి ఉండటం సహజం. కేసీఆర్ చెప్పిన వివరాలు, వాస్తవాలు సరిపోల్చాల్సి ఉంది. వాస్తవాలు ఏమిటనే దానిపై బీహెచ్ఈఎల్ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతాం” అని ఆయన చెప్పారు.
విచారణకు తాను రాలేనని, కమిషన్ చైర్మన్‌గా మీరే తప్పుకోవాలంటూ జస్టిస్ నర్సింహారెడ్డికి శనివారం మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లేఖ రాశారు. దీనిపై జస్టిస్ నర్సింహారెడ్డి ఆదివారం మీడియాతో స్పందించారు. విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన పరిణామాలను మాత్రమే తాను మీడియా ముందు వివరించానని తెలిపారు. ‘‘కేసీఆర్ తన లెటర్‌ను నాకు పంపే ముందు మీడియాకు విడుదల చేశారు’’ అని ఆయన చెప్పారు. కాగా, కేసీఆర్ పంపిన లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి విచారణ మొదలుపెట్టారు. ఆ లెటర్లో పేర్కొన్న అంశాలను పరిశీలించారు. లీగల్ అంశాలను లీగల్ టీమ్ పరిశీలించాలని కమిషన్ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందకపోతే.. ప్రత్యక్ష విచారణకు కూడా పిలుస్తామని ఇప్పటికే జస్టిస్ నర్సింహారెడ్డి ప్రకటించారు.