400కు పైగా ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాం : జాన్​మాస్క్

400కు పైగా ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాం : జాన్​మాస్క్

ఖైరతాబాద్, వెలుగు: చట్టసభల్లో క్రైస్తవుల ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేస్తున్నామని నేషనల్ క్రిస్టియన్ బోర్డు(ఎన్ సీబీ) అధ్యక్షుడు జాన్ మాస్క్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడలోని ఓ హోటల్లో క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, సమస్యలు, పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం జాన్ మాస్క్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా క్రైస్తవులపై ద్వేష భావం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు చేయడమే కాకుండా, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. 

ఈ నేపథ్యంలో దేశంలోని క్రైస్తవులను ఏకం చేసి, సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించినట్లు తెలిపారు. ఏ రాజకీయ పార్టీకీ క్రైస్తవులను ఓటు అడిగే అర్హత లేదని, మణిపూర్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో తీవ్రమైన దాడులు జరిగినా ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రశ్నించలేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో 400 పైగా ఎంపీ స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలవనివ్వబోమన్నారు. 

ప్రభుత్వాలు స్పందించి, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, క్రైస్తవ ఆస్తుల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకోవాలని డిమాండ్​చేశారు. ప్రతి రాష్ట్రంలో క్రైస్తవ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, పాస్టర్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి, క్రిస్టియన్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో క్రైస్తవ మత పెద్దలు పీటర్, సురేశ్, జాన్ వెస్లీ, నవీన్ కుమార్, జాషువా సామెల్, డేవిడ్ మార్క్, కాశీ, సతీశ్​కుమార్ తదితరులు పాల్గొన్నారు.