నిధుల కోసం కేంద్రం గల్లపట్టి అడుగుతం

నిధుల కోసం కేంద్రం గల్లపట్టి అడుగుతం
  • సిరిసిల్లలో మీడియాతో మంత్రి కేటీఆర్​
  • వరంగల్​ టెక్స్​టైల్ ​పార్కుకు వెయ్యి కోట్లు ఇయ్యాలె
  • తెలంగాణను పీఎం మిత్రలో చేర్చాలి
  • నిధుల కోసం బీజేపీ రాష్ట్ర లీడర్లు గొంతు విప్పాలని కామెంట్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: వరి విషయంలో పార్లమెంట్​ఉభయ సభల్లో ఎట్లా ఎండగట్టినమో ఇప్పటి నుంచి తెలంగాణకు నిధుల కోసం అట్లనే కేంద్రాన్ని గల్లపట్టి అడుగుతామని మంత్రి కేటీఆర్​ అన్నారు. ఫండ్స్ ఇవ్వడంలో కేంద్రం మొండిచేయి చూపుతోందని, దీనిపై ఇటు ప్రజాక్షేత్రం.. అటు పార్లమెంట్​లో కొట్లాడుతామని అన్నారు. శుక్రవారం ఆయన సిరిసిల్లలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఓటు వేసిన తర్వాత  క్యాంప్​ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేనేత, జౌళి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. బతుకమ్మ చీరలు, స్టూడెంట్స్​యూనిఫాంలు తదితర బట్టల కోసం మరమగ్గాల కార్మికులకు ప్రభుత్వం నుంచి రూ.1134 కోట్ల ఆర్డర్ ఇచ్చామన్నారు. వర్కర్ టు ఓనర్ పథకం ద్వారా కార్మికుడినే ఓనర్ చేసేందుకు శ్రీకారం చుట్టామని, ఇందు కోసం ర. 400 కోట్లతో సిరిసిల్ల అపెరల్ పార్క్ నిర్మాణం అవుతోందన్నారు. రాష్ట్రంలోని చేనేత ప్రాంతాలైన దుబ్బాక, గద్వాల, నారాయణపేట, పోచంపల్లి, సిద్దిపేట, ఆర్మూర్, కొత్తపేట లాంటి చోట్ల ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని మంజూరు చేయాలని అడిగితే కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్క్ ను 1200 ఎకరాల్లో  ఏర్పాటు చేసి అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు. కొరియాకు చెందిన యంగ్ వన్, కేరళకు సంబంధించిన కైటెక్స్ అనే సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం మిత్ర కొత్త పథకంలో భాగంగా వరంగల్ టెక్స్ టైల్స్ పార్క్ కు రూ. 1000 కోట్లు ఇవ్వాలని అడిగితే కేంద్రం నుంచి జవాబు లేదన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కోసం సెంటర్లు పెట్టుమన్నా.. ఉలుకు పలుకులేదన్నారు. తెలంగాణకు పవర్​లూమ్​క్లస్టర్ ఇవ్వాలని అడిగితే ఇవ్వకుండా.. మహారాష్ట్రలో పలు ప్రాంతాలకు ఇచ్చారని మండిపడ్డారు. ఇప్పటి వరకు కేంద్రాన్ని అడిగినం.. ఇక ఇప్పటి నుంచి డిమాండ్ చేస్తామని, విజ్ఞప్తులు మాని పార్లమెంట్ లో నిలదీస్తమని స్పష్టం చేశారు. 

బీజేపీ నాయకుల గొంతు విప్పాలె
కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడంపై బీజేపీ రాష్ట్ర నాయకులు గొంతు విప్పాలన్నారు. కొట్లాడి తెలంగాణకు ఫండ్స్​తేవాలన్నారు. ఏడున్నరేండ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడంలో బీజేపీ నాయకులు తమతో కలిసిరావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వస్ర్త పరిశ్రమ డెవలప్ మెంట్ కోసం చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుపోతే మరో కొత్త ఉద్యమం చేపడతామన్నారు.