
హైదరాబాద్, వెలుగు: రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన రాష్ట్ర పర్యాటక మంత్రుల సదస్సు విజయవంతంగా ముగిసింది. మంగళ, బుధవారాలు రెండ్రోజుల పాటు సదస్సు జరగగా.. 2025–26 కేంద్ర బడ్జెట్ ప్రణాళికల్లో పర్యాటక రంగంలో మార్పులు, ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి 50 అద్భుత స్థలాల అభివృద్ధి, టూరిజం హాట్, పీఎల్ఐ (పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్) ఆధారిత ప్రోత్సాహకాలపై చర్చించారు. దేశవ్యాప్తంగా ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రాలను రూపొందించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ముసాయిదా ప్రణాళికలు సమర్పించాయి.
ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల టూరిజం మంత్రులతో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. ప్రతి రాష్ట్రం, ప్రతి కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక ప్రపంచస్థాయి పర్యాటక ఆకర్షణీయ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహించినట్లు చెప్పారు. ‘ఒక రాష్ట్రం.. ఒక ప్రపంచ శ్రేణి ఆకర్షణీయ కేంద్రం’గా తీర్చిదిద్దాలనే నినాదంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ సదస్సులో తెలంగాణ టూరిజం ప్రాజెక్టులు హైలెట్‌గా నిలిచాయి.