హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేన్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు. ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశామని.. ఏటీసీ సెంటర్లతో నిరుద్యోగ యువతకు స్కిల్స్ పెంపొందిస్తామని చెప్పారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం (డిసెంబర్ 4) ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మంత్రి వివేక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేండ్ల పాటు అహంకార, అవినీతి పాలన సాగించిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఇసుక, బియ్యం మాఫియా దోపిడి చేశాయని ఆరోపించారు.
బీఆర్ఎస్ పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డ్ కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతోందని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
