లేటెస్ట్ మైనింగ్ టెక్నాలజీతో వృద్ధి సాధిస్తాం

లేటెస్ట్ మైనింగ్ టెక్నాలజీతో వృద్ధి సాధిస్తాం
  •     సింగరేణిని మరింత విస్తరింపజేస్తం: బలరామ్
  •     ఆస్ట్రేలియా సహకారం అందిస్తది
  •     రానున్న ఐదేండ్లలో లక్ష్యాన్ని చేరుకుంటామన్న సీఎండీ

హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో లేటెస్ట్ మైనింగ్ టెక్నాలజీ వాడకాన్ని పెంచి గణనీయమైన వృద్ధి సాధిస్తామని సీఎండీ బలరామ్ తెలిపారు. బొగ్గు ఉత్పత్తితో పాటు వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా థర్మల్, సోలార్ రంగాల్లోకి విజయవంతంగా అడుగుపెట్టినట్టు వివరించారు. ప్రస్తుతం సంస్థ వినియోగిస్తున్న టెక్నాలజీ, ఈ ఏడాది సాధించిన రికార్డు ఉత్పత్తి, ట్రాన్స్​పోర్ట్, టర్నోవర్, సంస్థ వృద్ధి రేటు వివరాలను గురువారం హైదరాబాద్​లోని సింగరేణి భవన్​లో ఆయన మీడియాకు వెల్లడించారు.

 సింగరేణి సంస్థ వచ్చే ఐదేండ్లలో పెట్టుకున్న 100 మిలియన్ టన్నుల కోల్ ప్రొడక్షన్ టార్గెట్ సాధించేందుకు లేటెస్ట్ మైనింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు తెలిపారు. టెక్నాలజీ కోసం ఆస్ట్రేలియా సహకారం అందించనున్నదని వివరించారు. ఆస్ట్రేలియా ట్రేడ్ ఇన్వెస్ట్​మెంట్ కమిషనర్ డెనిస్ ఈటెన్​తో భేటీ అయినట్లు చెప్పారు. 

‘‘వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర రంగాల్లోని అవకాశాలను పూర్తిగా పరిశీలిస్తున్నం. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన సింటార్స్ తదితర సంస్థలతో మైనింగ్, రక్షణ, సాంకేతిక విషయాల్లో సేవలు స్వీకరించాం. సంస్థలో అమలవుతున్న టెక్నాలజీని స్వయంగా పరిశీలించేందుకు నవంబర్​లో ఆస్ట్రేలియా టీమ్ సింగరేణి ప్రాంతానికి రానున్నది’’అని తెలిపారు. మైనింగ్ సెక్టార్​లో కొత్త టెక్నాలజీపై ఆస్ట్రేలియా నిర్వహిస్తున్న ట్రైనింగ్ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని డెనిస్ ఈటెన్ కోరారు.