న్యూఢిల్లీ: 2038 ఆసియా గేమ్స్‌ను నిర్వహించేందుకు ఇండియా సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను అధికారికంగా దాఖలు చేసింది. ప్రపంచ క్రీడలకు కేంద్రంగా నిలవాలన్న ఏకైక లక్ష్యంతో ఇండియా ఆ దిశగా కీలక అడుగు వేసింది. చైనాలోని సాన్యాలో ఇటీవల జరిగిన ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఇండియా ప్రతిపాదనపై చర్చ జరిగిందని ఐవోఏ సీఈవో రఘురామ్ అయ్యర్ శుక్రవారం వెల్లడించాడు.
వీలైనంత త్వరగా దీనిపై ఓసీఏ నుంచి స్పష్టత వస్తుందన్నాడు. బిడ్ దాఖలు చేసేందుకు ప్రత్యేక గడువు ఏమీలేదన్నాడు. 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2036 ఒలింపిక్స్ కోసం కూడా ఇండియా.. అహ్మదాబాద్‌నే ప్రతిపాదించింది. ఒకవేళ 2038 ఆసియా క్రీడల బిడ్ గెలిస్తే వాటిని కూడా అక్కడే నిర్వహించే అవకాశం ఉంది.
ఇక 1951, 1982లో న్యూఢిల్లీ ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. 2026లో ఐచి-నగోయా (జపాన్), 2030లో దోహా (ఖతార్), 2034లో రియాద్ (సౌదీ అరేబియా) ఈ క్రీడలను నిర్వహించనున్నారు. ఇండియాతో పాటు సౌత్ కొరియా, మంగోలియా కూడా 2038 క్రీడల కోసం ఆసక్తి చూపిస్తున్నాయి. 2028లో ఆతిథ్య నగరం ఖరారయ్యే అవకాశం ఉంది.

