
- రెండ్రోజుల్లో 30% మందికి సన్న బియ్యం ఇచ్చినం
- ఈ స్కీమ్ దేశ చరిత్రలో నిలిచిపోతుంది
- అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తం
- హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
- కలెక్టరేట్లో సన్న బియ్యం పంపిణీపై సమీక్ష
హైదరాబాద్‌సిటీ/బషీర్‌బాగ్, వెలుగు: రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ స్కీమ్దేశ చరిత్రలో నిలిచిపోతుందని హైదరాబాద్జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేట్లో సన్న బియ్యం పంపిణీపై పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సన్న బియ్యం పంపిణీలో ఎక్కడా రాజీపడొద్దని, ఈ స్కీమ్‌కు ప్రభుత్వం బియ్యం అధిక ప్రాధాన్యం ఇస్తోందని అధికారులకు సూచించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో గత నెలలో అందించలేకపోయామన్నారు. అన్ని పాయింట్లను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సిబ్బంది కొరత తీర్చేందుకు త్వరలో పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. త్వరలోనే అర్హులందరికీ రేషన్‌కార్డులు జారీ చేస్తామన్నారు. సిటీ పరిధిలో 14,500 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 653 రేషన్ షాపులు ఉండగా, స్కీమ్‌ను ప్రారంభించిన 2 రోజుల్లోనే 30% కుటుంబాలకు పైగా బియ్యం అందించామని తెలిపారు.
సిటీలో సరిపడా ప్రభుత్వ గోదాములు లేవని, ప్రభుత్వ స్థలాల్లో గోదాములు ఏర్పాటుకు ప్రతిపాదనలు రెడీ చేసి పంపాలని మంత్రి పొన్నం ఆదేశించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్కలెక్టర్ ముకుంద రెడ్డి, జీహెచ్ఎంసీ అడిషనల్కమిషనర్చంద్రకాంత్, సివిల్సప్లయ్అధికారి రమేశ్, ఆర్డీఓలు, ఎస్ఓలు, ఏఎస్ఓలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
అలాగే హిమాయత్ నగర్ ఆదర్శ బస్తీలోని 602 నంబర్రేషన్షాపులో శనివారం సన్న బియ్యం పంపిణీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. అనంతరం నారాయణగూడ గాంధీ కుటీర్ సమీపంలోని సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్లు విజయారెడ్డి, మహాలక్ష్మి, అధికారులతో కలిసి భోజనం చేశారు.
ముషీరాబాద్: పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం చారిత్రక నిర్ణయమని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రూ.60 నుంచి 80 పలికే కేజీ బియ్యంను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని, లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. శనివారం ఆయన గాంధీనగర్ డివిజన్ ఎల్లమ్మ బస్తీలో సన్నబియ్యం పంపిణీ చేశారు. ఓ లబ్ధిదారుని ఇంట్లో సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు.