మా అడవిని అమ్మనీయం

మా అడవిని అమ్మనీయం

ఈక్వెడార్‌‌లోని అమెజాన్‌‌ అడవిని కాపాడుకునేందుకు ఉద్యమించిన ఆదివాసీ మహిళ నెమోంటే నెంక్విమో. అమెజాన్ అడవుల్లో ఎన్నోరకాల ఆదివాసీ తెగలు ఉన్నాయి. అందులో నెంక్విమోది ‘వావోరాని’ తెగ.  తమ ప్రాంతాన్ని ఈక్వెడార్ ప్రభుత్వం అమ్మకానికి పెడుతోందంటూ పోరాటంలోకి దిగింది. కోర్టులో కేసు వేసింది. 2019లో ఆదివాసులకు మద్దతుగా అక్కడ మైనింగ్ ఆపాలంటూ స్టే ఇచ్చింది. ‘వావోరాని ప్రజలు.. తమ మాతృభూమిని అమ్మబోరు’ అంటూ నెంక్విమో చేసిన స్లోగన్  పాపులర్ అయ్యింది. ‘‘వావోరాని తెగలో మాతృస్వామ్యం ఉంది. ముఖ్యమైన  నిర్ణయాలు తీసుకునేది మహిళలే. మగవాళ్లు వేటకి, యుద్ధానికి వెళ్తారు. మహిళల మాటలను పురుషులు వినేవారు. కానీ, తరువాత మెల్ల మెల్లగా మార్పు రావటం మొదలైంది. క్రైస్తవ మిషనరీలు వచ్చాక ఆడమ్‌‌, ఈవ్ కథ చెప్పి, అయోమయం సృష్టించారు. ఆడ–మగ మధ్యలో తేడాలు చూపించారు. మమ్మల్ని మార్చటానికి ప్రయత్నించారు. కానీ, ఇప్పటికీ నిర్ణయాల విషయంలో మహిళల పాత్ర తగ్గలేదు. మేము మా కల్చర్​ని నిలబెట్టుకునేందుకు పోరాటం చేస్తున్నాం’’ అంటూ మతాల పేరుతో తమ భూములని ఆక్రమించే ప్రయత్నాలని భయం లేకుండా బయట పెట్టింది నెమోంటే. ఈక్వెడార్ ప్రభుత్వం 2018లో అమెజాన్ అటవీ ప్రాంతంలోని 70 లక్షల ఎకరాలను ఆయిల్ బావులకోసం వేలం వేస్తామని ప్రకటించింది. ఆ ప్రకటన రాగానే ఆదివాసీ హక్కులు, కల్చర్​ని కాపాడటానికి పనిచేసే ‘సీబో అలియెన్స్’ అనే ఒక గ్రూప్ తయారు చేసి ‘మా అడవిని అమ్మం’ అనే హ్యాష్‌‌ ట్యాగ్‌‌తో  డిజిటల్ ప్రచారం మొదలుపెట్టారు. అటవీ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల మంది ఆమెకు మద్దతు తెలిపారు. ఈక్వెడార్ ప్రభుత్వంపై ఆదివాసుల పోరాటం మొదలైంది.  ఆదివాసుల ఆస్తి అయిన అటవీ భూములని అమ్మకానికి పెట్టే హక్కు లేదంటూ ఈక్వెడార్ ప్రభుత్వం మీద కేసు పెట్టారు. 2019 ఏప్రిల్‌‌లో కోర్టు ఐదు లక్షల ఎకరాల భూమిలో ఆయిల్ తవ్వకాలు ఆపాలంటూ తీర్పు చెప్పింది. ఇకముందు ఆ  భూముల్ని వేలం వేయాలన్నా, అమ్మాలన్నా  స్థానిక ప్రజల అంగీకారం ఉండాల్సిందే  అని చెప్పింది. ప్రభుత్వం నుంచి బెదిరింపులు వచ్చినా, అరెస్టు చేస్తామంటూ భయపెట్టినా వెనక్కి తగ్గలేదామె. అంతర్జాతీయంగా తన పోరాటం గురించి తెలిసేలా చేసింది. 2020 సంవత్సరానికి గోల్డ్ మాన్ ఎన్విరాన్‌‌మెంటల్ ప్రైజ్’ వచ్చినప్పుడు కూడా “ఈ అవార్డు వల్ల మా పోరాటం గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది. మద్దతు పెరుగుతుంది. మా అడవిని కాపాడుకోవటానికి బలం వస్తుంది” అన్నది నెమోంటే నెంక్విమో.

 

For More News..

పర్యావరణ విధ్వంసంతోనే ప్రకృతి విపత్తులు

పుస్తకాల్లో భాష మారాలె

ఇండియా ఓ స్వర్గం.. పాక్​కు వెళ్లని అదృష్టవంతుల్లో నేనొకడిని