నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తాం : మంత్రి తుమ్మల

నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తాం : మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, వెలుగు : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల పక్షానే ఉంటుందని పేర్కొన్నారు. ‘‘అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. గ్రామాల వారీగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. ఆ నివేదిక అందిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పరిహారం ప్రకటిస్తాం. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటం’’ అని భరోసా ఇచ్చారు. ఈ మేరకు తుమ్మల బుధవారం ప్రకటన విడుదల చేశారు. ‘‘ఎన్నికల కోసం, రాజకీయాల కోసం ఉత్తుత్తి మాటలు చెప్పం. ఉత్తుత్తి పథకాలు ప్రకటించం. బీఆర్ఎస్ నేతలు ప్రేలాపనలు మానుకోవాలి” అని అందులో పేర్కొన్నారు. 

పదేండ్ల పాటు రైతులను పట్టించుకోని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు.. ఇప్పుడు పంట నష్టంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని తుమ్మల మండిపడ్డారు. ‘‘బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో రైతులు పంట నష్టపోతే పట్టించుకోలేదు. పోయినేడాది ఎన్నికల టైమ్ లో హడావిడి చేసి ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. రైతులకు కేవలం రూ.150 కోట్లు పంపిణీ చేశారు. మరో రూ.350 కోట్లకు జీవో ఇచ్చినా నిధులు విడుదల చేయలేదు. ఆ తర్వాత మరో 1.25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా పట్టించుకోలేదు. వరదలు వచ్చి పొలాల్లో ఇసుక మేటలు వేసినా గత ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు” అని ఫైర్ అయ్యారు. ‘‘రుణమాఫీ అమలు చేస్తామని గొప్పగా చెప్పుకున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు.. అదీ సరిగా చేయలేదు. మొదటి విడతలో నాలుగు దశల్లో మాఫీ చేశారు. ఇక రెండోసారి 2018లో రూ.19,600 కోట్లకు కేవలం రూ.9,500 కోట్లే మాఫీ చేసి మమ అనిపించారు. ఇప్పుడదే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. గతంలో యాసంగిలో మే వరకు రైతుబంధు జమ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రైతుబంధు ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. 

మేం ఇప్పటికే 5 ఎకరాల వరకు రైతుబంధు జమ చేసినం. మా ప్రభుత్వ చిత్తశుద్ధిని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది” అని అన్నారు. గత ప్రభుత్వ పాపాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, తాము క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడుపుతూ నిధుల్లో అధిక భాగం రైతుల కోసమే కేటాయిస్తున్నామని తెలిపారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌  గొప్పలకు పోయి నీళ్లు వృథా చేసింది. అవసరం లేని సందర్భాల్లోనూ కాలువలకు నీళ్లు విడుదల చేసింది. ఫలితంగా నాగార్జున సాగర్ నుంచి మొదటి పంటకే నీళ్లు ఇవ్వలేని దుస్థితి తెచ్చారు. విద్యుత్ ఉత్పత్తిని ప్రణాళిక ప్రకారం చేయకుండా నీటిని విడుదల చేసి సముద్రం పాల్జేశారు. సాగర్‌‌‌‌ రిజర్వాయర్ ను ఖాళీ చేసిన పాపం గత ప్రభుత్వానిదే” అని మండిపడ్డారు.