వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అందజేస్తాం

వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అందజేస్తాం

ఉప్పల్: వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అందజేస్తామని రాష్ట్ర ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల గురించి ఆయన స్థానికులకు వివరించారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మల్లాపూర్ లో అద్భుతమైన వైకుంఠధామాన్ని నిర్మించామన్నారు. అలాగే ఉప్పల్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా కొత్తగా ఫ్లై ఓవర్ బ్రిడ్డీల నిర్మాణంతో పాటు స్కైవేలను కూడా నిర్మిస్తున్నట్లు చెప్పారు. మన బస్తీ.. మన బడి పేరుతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను నడపనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 70 శాతం డబుల్ బెడ్రూ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా త్వరలోనే 91 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులు ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ప్రతిపక్షాలు కులమతాల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

దోచుకునెటోళ్లను వదలం

గోవా అసెంబ్లీకి మూడు జంటలు