దోచుకునెటోళ్లను వదలం

దోచుకునెటోళ్లను వదలం

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2024  లోక్​సభ ఎన్నికల ఫలితాలకు సంకేతమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. బీజేపీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఈసారి హోలీ పండుగ మార్చి 10నే వచ్చేసినట్లు ఉందని, వారి వల్లే నాలుగు రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధ్యమైందని చెప్పారు. ప్రజా ధనాన్ని దోచుకునెటోళ్లను వదిలిపెట్టేది లేదని, అవినీతిపై విచారణ జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ‘‘2017 యూపీ ఎన్నికల ఫలితాలు.. 2019 లోక్​సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని చాలా మంది చెప్పారు. ఇప్పుడు 2‌022 యూపీ ఫలితాలు.. 2024 లోక్​సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయి. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందనేందుకు ఈ రిజల్ట్స్​ సంకేతం” అని అన్నారు.  దాదాపు 40 ఏండ్ల తర్వాత ఉత్తరప్రదేశ్​లో ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం గొప్ప విషయమని, అది బీజేపీకే సాధ్యమైందని చెప్పారు. ఉత్తరాఖండ్​లో కూడా ఒకపార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం మొదటిసారి అని, ప్రజలు బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని మోడీ పేర్కొన్నారు. 

ప్రజలు అన్నీ గమనిస్తున్నరు

బీజేపీ విజయంలో మహిళలు, యువతది కీలక పాత్ర అని ప్రధాని మోడీ అన్నారు. కుల, వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని మరోసారి ఉత్తరప్రదేశ్​ ఓటర్లు చాటిచెప్పారని, విచ్ఛినకరశక్తులను దూరం పెట్టారని, అభివృద్ధికే పట్టం కట్టారని తెలిపారు. కరోనా కష్టకాలంలో కొందరు లీడర్లు ఇష్టమున్నట్లు మాట్లాడారని, వ్యాక్సిన్​పైన కూడా కామెంట్లు చేశారని, ప్రజలు అన్నీ గమనించారని అన్నారు. అవినీతిని అంతం చేస్తామని, ఎప్పుడో ఒకరోజు వారసత్వ రాజకీయాలు అంతమవుతాయని చెప్పారు. పంజాబ్​లో కూడా బీజేపీ కార్యకర్తలకు చాలా కష్టపడ్డారని, రాబోయే రోజుల్లో ఆ రాష్ట్రంలోనూ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.