
- త్వరలోనే గ్రామాలకు పాలనాధికారులను నియమిస్తం: మంత్రి సీతక్క
- కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నం: మంత్రి పొన్నం
- ప్రభుత్వంలో సమస్యలను నేరుగా చెప్పుకునే అవకాశం: ఎమ్మెల్సీ కోదండరాం
- పెద్ద అంబర్‌పేటలో సెక్రటరీల ఆత్మీయ సమ్మేళనం
ఎల్బీనగర్, వెలుగు : గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ఈ నెల 25లోగా పరిష్కరిస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీల ఎన్నికలు జరగకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతోనే కులగణన చేపట్టామని, అందుకే పంచాయతీ ఎన్నికలు కొంత ఆలస్యం అయ్యాయని చెప్పారు. తెలంగాణ పంచాయతీ సెక్రటరీల ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో శనివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్దఅంబర్‌పేటలోని ఓ ఫంక్షన్హాల్లో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్కతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్ గౌడ్, కోదండరాం, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో సెక్రటరీలపై భారం పడుతోందన్నారు. అయినా, వారు కష్టపడి పనిచేస్తున్నందున అభినందనలు తెలిపారు. సెక్రటరీలపై పనిభారం తగ్గించేందుకు త్వరలోనే గ్రామాలకు పాలనాధికారులను నియమిస్తామన్నారు.
వీఆర్‌వోలను తొలగించిన గత ప్రభుత్వం సెక్రటరీలతో నాలుగేండ్లు సేవలు చేయించుకొని, వారి సర్వీస్‌ను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ ఇచ్చిన గత ప్రభుత్వం.. ఎక్కడైనా తప్పు జరిగితే అన్యాయంగా సెక్రటరీలపై చర్యలు తీసుకుందన్నారు. ఈ విధానాన్ని సమీక్షించి పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేస్తామని చెప్పారు.
ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యలను ఆన్‌లైన్‌లో చెప్పుకునేలా ఆన్‌లైన్ గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రెండు, నాలుగో శుక్రవారం సమస్యలను చెప్పుకోవచ్చన్నారు. అనంతరం ఇటీవల చనిపోయిన మహబూబాబాద్‌కు చెందిన సెక్రటరీ వెంకన్న ఫ్యామిలీకి కార్యదర్శుల తరఫున రూ. 3 లక్షల చెక్కును మంత్రి సీతక్క అందజేశారు.
ముందుగా ఆర్థికభారం లేని సమస్యల పరిష్కారం: ఎమ్మెల్సీ కోదండరాం
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు భయంభయంగా శివారు ప్రాంతాల్లో సమావేశాలు పెట్టుకోవాల్సి వచ్చేదని.. కానీ, ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలోనే మీటింగ్‌లు పెట్టుకొని సమస్యలను నేరుగా వారికే చెప్పుకునే అవకాశం ఉందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ‘పంచాయతీ కార్యదర్శులు అడిగే డిమాండ్స్ పెద్దవేమీ కాదు. పైసలతోని అవసరం లేకుండా పరిష్కరించగలిగే సమస్యలు చాలా ఉన్నాయి. మొదట వాటిని పరిష్కరించుకొని, తర్వాత ఫైనాన్షియల్ రిలేటెడ్ సమస్యలను పరిష్కరించుకోవాలి.
కార్యదర్శులు ఎవరూ అధైర్యపడొద్దు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని’అని చెప్పారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. సెక్రటరీలు ధైర్యంగా ఉండాలని, సమస్యలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో సెక్రటరీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ. ప్రశాంత్ గౌడ్, జనరల్ సెక్రటరీ ఎన్. నాగరాజు, కోశాధికారి శశిధర్ గౌడ్, నరేందర్ రెడ్డి, విజయ్, మధు పాల్గొన్నారు.
కార్యదర్శుల హక్కులను కాపాడుతం: మంత్రి పొన్నం
పంచాయతీ సెక్రటరీల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం అన్నారు. ‘సమస్యల పరిష్కారంలో మంత్రి సీతక్కకు నా సహకారం అందిస్తా. గత పదేండ్లలో ఆర్థిక విధ్వంసం జరిగింది. అందుకే కార్యదర్శుల సమస్యల పరిష్కారంలో కొంత ఆలస్యం జరుగుతోంది. చీఫ్ సెక్రటరీకి జాబ్ చార్ట్ లేదు. అలాగే, పంచాయతీ సెక్రటరీలకు కూడా జాబ్ చార్ట్ ఉండడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పంచాయతీ కార్యదర్శులదే కీలకపాత్ర. మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేరిస్తే.. మీ హక్కులను కాపాడుతాం’ అని పొన్నం హామీ ఇచ్చారు.