ధరణిపై త్వరలో రాష్ట్రమంతా స్పెషల్ డ్రైవ్

ధరణిపై త్వరలో రాష్ట్రమంతా స్పెషల్ డ్రైవ్

సిద్దిపేట జిల్లా : ధరణి సమస్యలు వంద శాతం పరిష్కరిస్తామని.. ములుగు గ్రామ రెవెన్యూ సమస్యలు పూర్తయ్యాక మండలానికి.. ఆ తర్వాత రాష్ట్రంలో అమలయ్యేలా చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. త్వరలోనే రాష్ట్రం మొత్తానికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి నూరు శాతం పరిష్కారం అయ్యేలా చేద్దామని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ములుగు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ధరణి పోర్టల్ అవగాహన సదస్సులో చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, సీఎం ఓఎస్డీ స్మిత సబర్వాల్, రాహుల్ బొజ్జా , జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ములుగు రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సదస్సులో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఒకసారి ధరణితో రిజిస్ట్రేషన్ అయితే ఇక భూమి పదిలంగా ఉంటుందని, పైరవి కారులను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ఎవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండా మీ దగ్గరికి వచ్చి సమస్యలు పరుష్కారం చేస్తామన్నారు. పెద్ద పనిని పూర్తి చేయాలంటే చిన్న చిన్న సమస్యలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. గతంలో రిజిస్ట్రేషన్ కోసం అనేక సమస్యలు ఉండేవని, ధరణి వచ్చాక గజ్వేల్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ములుగు తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. 
ధరణిపై గ్రామాలకు వెళ్లి అక్కడే రైతుల సమస్యలు పరిష్కరిస్తాం: 
ధరణి పై అధికారులు గ్రామాలకే వెళ్లి అక్కడే రైతుల సమస్యలు పరిష్కరిస్తారని చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ తెలిపారు. ధరణిలో  9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించి లబ్ది పొందారని, ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటిది లేదన్నారు. ధరణి వల్ల రైతుల భూమి పదిలంగా ఉంటుందని, రైతులకు తెలియకుండా వేరే వాళ్లు మార్పు చేయలేరని తెలిపారు. స్థానికంగా 186 మంది దరఖాస్తులు ఇచ్చారని, ఈ సమస్యలు తీరిస్తే ఇక ములుగులో ఎలాంటి భూ సమస్యలు ఉండవన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో గ్రామాలకు వెళ్లి అక్కడే రైతులకు అవగాహన కల్పించి 100 శాతం ధరణి సమస్యలు పూర్తయ్యేలా చేస్తామన్నారు. ధరణిపై వస్తున్న సమస్యలు ఇప్పటివి కావు, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సమస్యల్ని ప్రత్యేక దృష్టి పెట్టి తీర్చాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని సీఎస్ వివరించారు.