ఎల్ నినోను ఎదుర్కొంటం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి

ఎల్ నినోను ఎదుర్కొంటం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
  • దేవాదుల ఎత్తిపోతలతో సాగు, తాగు నీరు

వరంగల్‍/హనుమకొండ, వెలుగు: ఎల్ నినోను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి తెలిపారు. ఎల్‍నినో ప్రభావం నేపథ్యంలో మంగళవారం ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్‍తో కలిసి ఉమ్మడి వరంగల్  జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఎల్‍నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు.

దేవాదుల లిఫ్ట్​ నుంచి తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. దేవాదుల మోటార్లు పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి వరంగల్‍తో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాలకు తాగు, సాగునీటిని అందించే దేవాదులను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా వర్షాభావ పరిస్థితులపై సమగ్ర నివేదికను కేంద్రానికి పంపించి, రాష్ట్రానికి సాయం, మద్దతు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఉమ్మడి వరంగల్​ జిల్లాకు సీనియర్‍ ఐఏఎస్​ ఆఫీసర్​ దేవసేనను స్పెషల్​ ఆఫీసర్​గా నియమించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం పదేండ్లలో దేవాదుల ప్రాజెక్ట్  పూర్తి చేయకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలోకి 16,632 క్యూసెక్కుల నీరు పోతుంటే మోటార్లు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు.

దేవాదులపై చర్చించేందుకు అసెంబ్లీలో డిబేట్​ పెడదామని, ప్రభుత్వం రెడీగా ఉందని సవాల్​ విసిరారు. ఎల్‍నినోను ఎదుర్కొనే క్రమంలో లెమన్​ గ్రాస్​ అంశం చర్చకు వచ్చింది. మంత్రులు మాట్లాడుతూ సైంటిస్టులు సూచించిన విధంగా లెమన్​ గ్రాస్​ వంటి ఆదాయాన్ని అందించే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలన్నారు.