హైదరాబాద్, వెలుగు: ఏఐ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్ఎం) సంస్థ సేల్స్‌ఫోర్స్ 2030 నాటికి దేశంలో పది లక్షల మందికి ఏఐ ఆధారిత నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సీఈఓ అరుంధతి భట్టాచార్య మాట్లాడుతూ ట్రయల్‌హెడ్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
భారతీయ సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సహకారంతో వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారు. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (మాహే) లాంటి సంస్థలలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తారు. యాక్సెంచర్, డెలాయిట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి భాగస్వామ్య నెట్‌వర్క్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని అరుంధతి వివరించారు.
