
- మునుగోడులో బీసీల గోడు వినిపిస్తం బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ దాసు సురేశ్
ముషీరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో బీసీల గోడు వినిపిస్తూ..బీసీ ఓటర్ల చైతన్యానికి ఎన్నికను వాడుకుంటామని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ దాసు సురేశ్ అన్నారు. బీసీలను మోసం చేస్తున్న బద్మాష్ పార్టీల బాగోతాన్ని బట్టబయలు చేస్తామని, బీసీల రాజకీయ ఎదుగుదల కోసం నిబద్దతతో కలిసివచ్చే ఏ పార్టీతోనైనా దోస్తీ చేస్తామన్నారు. బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.
అనంతరం మీడియా సమావేశంలో కన్వీనర్ దాసు సురేశ్ మాట్లాడుతూ మునుగోడు ప్రజలు, స్థానిక బీసీ ఓటర్ల మూడ్ ను కనుగొనడానికి మునుగోడు నియోజకవర్గంలో సర్వే నిర్వహిస్తున్నామన్నారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన రిపోర్టు వస్తుందని, స్థానిక బీసీల అభీష్టం మేరకు త్వరలోనే మునుగోడు కేంద్రంగా నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. బీసీ రాజ్యాధికార సమితి ప్రతివ్యూహాలతో త్వరలోనే ప్రజాక్షేత్రంలో అడుగు పెడతామన్నారు. ముఖ్య నాయకులు నారగోని, బొమ్మ నరేందర్, చాపర్తి కుమారస్వామి హాజరయ్యారు.