భారత కార్పొరేట్ రంగంలో ప్రస్తుతం ఒక భారీ డీల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. అదే జేపీ అసోసియేట్స్ వ్యాపార ఆస్తులను దక్కించుకునే పోరు. సుమారు రూ.57వేల185 కోట్ల భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థను దక్కించుకోవడానికి - గౌతమ్ అదానీ, అనిల్ అగర్వాల్ తలపడ్డారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు మెట్లెక్కింది. అసలు ఈ వివాదం ఏంటి వేదాంత గ్రూప్ కోర్టు దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వేదాంత గ్రూప్ అధినేత అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. జేపీ గ్రూప్ కోసం జరిగిన బిడ్డింగ్‌లో తామే హైయెస్ట్ బిడ్డర్ అని, తాము గెలిచినట్లు రాతపూర్వక నిర్ధారణ కూడా వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా కొన్ని రోజుల తర్వాత నిర్ణయం మారిపోయిందని.. చివరికి అదానీ గ్రూప్‌ను విజేతగా ప్రకటించారని అనిల్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టులో వెల్లడైన వివరాల ప్రకారం జేపీ అసోసియేట్స్ ఆస్తుల కోసం వేదాంత బిడ్ రూ.16వేల 726 కోట్లుగా ఉండగా.. గౌతమ్ అదానీ బిడ్ కేవలం రూ.14వేల 535 కోట్లుగా ఉంది. కొనటానికి ఆఫర్ చేసిన ధర పరంగా చూస్తే వేదాంత ముందుంది. మరి అదానీకి ఎందుకు ఇచ్చారు? దీనికి రుణదాతల కమిటీ చెప్తున్న కారణం ఏంటంటే.. కేవలం ధర మాత్రమే కాదు పేమెంట్ ముఖ్యం అంటున్నారు. అదానీ గ్రూప్ సుమారు రూ.6వేల కోట్లు ముందే చెల్లిస్తామని, మిగిలిన మొత్తాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పింది. కానీ వేదాంత చెల్లింపుల గడువు ఐదేళ్లుగా ఉంది. అందుకే తాము అదానీ బిడ్ వైపు మొగ్గు చూపామని వారు చెబుతున్నారు. అయితే ఇద్దరి బిడ్స్ మధ్య దాదాపు రూ.2వేల కోట్ల తేడాపై ఇప్పుడు పెద్ద చర్చ కొనసాగుతోంది.
"ధర్మం ప్రకారం ఇచ్చిన మాట వెనక్కి తీసుకోకూడదు" అంటూ అనిల్ అగర్వాల్ భగవద్గీతలోని కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు. NCLT ఇప్పటికే అదానీ బిడ్‌కు ఆమోదం తెలపగా.. దీనిపై వేదాంత గ్రూప్ NCLATను ఆశ్రయించింది. అక్కడ స్టే లభించకపోవడంతో ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
ఎందుకు ఈ ఆస్తుల కోసం ఇంత పోటీ?
జేపీ గ్రూప్‌కు నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో విలువైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, సిమెంట్ ప్లాంట్లు, హోటళ్లు, యమునా ఎక్స్‌ప్రెస్‌వే వంటి భారీ ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులు ఎవరికి దక్కినా వారి వ్యాపార సామ్రాజ్యం మరో మెట్టు ఎక్కినట్టే. అందుకే ఈ సంస్థ ఆస్తుల కోసం ఇంతగా పోటీ పడుతున్నారు అనిల్ అగర్వాల్, గౌతమ్ అదానీ. మెుత్తానికి ఏప్రిల్ 10న NCLATలో తదుపరి విచారణ జరగనుంది. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఈ మెగా డీల్ భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పుకోవాలి.
